మహారాష్ట్ర ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య బంధం తెగడం సీనియర్ కమలనాథుడు ఎల్ కే అద్వానీకి ఏ మాత్రం ఇష్టం లేదు. శివసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తేనే మంచి ఫలితాలు ఉండేవని ఆయన అభిప్రాయం. ఆ మాటను ఆయన బయటకు కూడా చెప్పాడు. అయితే బీజేపీ నేతలే ఆయన మాటను ఖాతరు చేయలేదు. వారు శివసేన బంధాన్ని తెంపేసుకొన్నారు. తమ ఆత్మగౌరవాన్ని శివసేన వాళ్లు దెబ్బతీస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శివసేన తో బంధాన్ని తెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ముందు అద్వానీ ఆ విషయంలో ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించకోలేదు. మరి ఇప్పుడైనా అద్వానీ మాటను పట్టించుకొనే నాథుడు ఉన్నాడా?! అనే సందేహం జనిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ధ శక్తిగా అవతరించి.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం అవకాశం లేకుండా పోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెళ్లి శివసేనతో కలవడమే మంచిదని అద్వానీ అంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్ఎన్ఎస్ వాళ్లేమో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తాము బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సదా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఎమ్ఎన్ఎస్ ప్రకటించింది. అయితే ఎమ్ఎన్ఎస్ తో వద్దు.. శివసేనతో ముద్దు అని అద్వానీ అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ నేతలు అద్వానీ మాటకు విలువనిస్తారా?! శివసేనతో కలిసి సాగుతారా?! అనేది అనుమానాస్పదమే! మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: