బాబు రావాలి.. జాబు రావాలి.. తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలు.. ఇలా రెండు తెలుగు రాష్ట్ర్ట్రాల్లోనూ యువతకు గత ఎన్నికల్లో గాలమేశారు. అటు చంద్రబాబు.. ఇటు కేసీఆర్ ఇద్దరూ.. నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేపారు. చంద్రబాబు ఏకంగా ఇంటికో ఉద్యోగం అన్నారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి ఇద్దరూ మొండిచేతులే చూపిస్తున్నారు. నెలలు గడచిపోతున్నా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా ఉసూరుమనిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అసలు ఆ ప్రస్తావనే ఎక్కడా తేవడం లేదు. ఉద్యోగాల భర్తీ చేపడితే తమపై మరింత ఆర్థిక భారం అవుతుందని ఇద్దరూ భావిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగుల వయోరిమితిని పెంచేశారు. దీంతో కొత్త ఉద్యోగాలకు కోత పడింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ నిరుద్యోగులకు తీరని అన్యా యం చేశారనే విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో చెప్పుకోదగిన రీతిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. కేవలం టీచర్లు, విఆర్‌వోల నియామకాలను మాత్రమే ఉమ్మడి ప్రభుత్వం చేపట్టింది తప్ప పూర్తిస్థాయిలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయ లేదు. ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నా రాష్ట్రప్రభుత్వాల కటాక్షం మాత్రం లభించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్ణయించిన వయోపరిమితి దాటిపోయి నిరు ద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, స్థానికత ఆధారంగా తమకు అవకాశాలు లభిస్తాయని ఎంతో ఆశించిన నిరుద్యోగులకు ముఖ్యమంత్రుల తీరు మింగుడు పడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: