తెలంగాణ వామపక్షాల శిబిరంలో కొద్దిగా కదలికలు మొదలయ్యాయి. కదలికలని అంటున్నది అప్పుడో ప్రకటన, ఇక్కడో కార్యక్రమం గురించి కాదు. అవి ఎప్పుడూ ఉండేవే. కాని అంతకుమించి కొద్దిగా జరుగుతున్నది. వామపక్షాల విలీనం మాట ఇప్పటికి లేకున్నా కార్యాచరణకోసం ఒకటి కావాలన్నది వారి ఆలోచన. నిజానికి ఈ ఆలోచన కొత్తది కాదు. వారిట్లా ఆలోచించటం, కలిసి కూర్చుని కార్యాచరణ ఏదో రూపొందించుకోవటం, తిరిగి అంతలోనే ఎవరిదారి వారిది కావటం లోగడ పలుమార్లు జరిగి ఆ శిబిరం మొత్తం నవ్వుల పాలవుతూ వచ్చింది. కొంతకాలం తర్వాత ప్రజలకు నవ్వటం కూడా వృథా అనిపించింది. కాని ఈసారి ఎందుకో కాస్త భిన్నమైన వాతావరణం ఆ శిబిరంలో కనిపిస్తున్నది. ముఖ్యం గా రాష్ట్ర విభజన కారణంగా ఈ భిన్న వాతావరణం ఏర్పడుతున్నదేమోననిపిస్తున్నది. తెలంగాణ సిపిఐ, సిపిఎంలలో తామిక గట్టిగా పూనుకుని వామపక్ష శిబిరం శక్తివంతమయేందుకు పూనుకోవాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఇది మొత్తానికి పక్కకు తోసివేయకుండా జాగ్రత్తగా గమనించవలసిన పరిణామమని చెప్పాలి. వారికి గతంలో లేని పట్టుదల, ఆశాభావాలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎందుకు కలుగుతున్నట్లు? ఈ ప్రాంతం ఒకప్పుడు వారికి బలమైన క్షేత్రం. ఇక్కడి సామాజికవర్గాల సంఖ్య, ఆర్థిక పరిస్థితుల కారణంగానే వారికది అటువంటి క్షేత్రమైంది. ఆ పరిస్థితి ఇప్పటికీ ఇంచుమించు అదే విధంగా ఉన్నాయన్నది వారి అంచనా. పోతే, ఇంతకాలం తెలంగాణ అన్నది విడిగాకాక సీమాంధ్ర ప్రాంతంలో కలిసి ఉండినందున, రెండు ప్రాంతాల సామాజిక- ఆర్థిక- సాంస్కృతిక స్వభావాలు భిన్నమైనందున, తెలంగాణకు ప్రత్యేకమైన స్వభావమన్నది ఆంధ్రప్రదేశ్ అనే విస్తృత భూభాగంలో పలచబడింది. ఆ విస్తృత భూభాగంలో పార్టీల నాయకత్వాలు తెలంగాణ వారికి ఎప్పుడూ లేవు గనుక, అక్కడివారు తమ ఆలోచనల ప్రకారం చొరవలు తీసుకుని కార్యాచరణలకు పూనుకొనే అవకాశాలు లేకపోయాయి. ఆ కాలమంతా వారిది, ఉక్కిరిబిక్కిరి పరిస్థితే. ఆ కాలంలో కమ్యూనిస్టేతర పార్టీలలోనే పరిస్థితులు ఆ విధంగా ఉండినపుడు ఇక సైద్ధాంతికమైన, నిర్మాణపరమైన కట్టడులు తీవ్రంగా ఉండే కమ్యూనిస్టు పక్షాలలో పరిస్థితి ఏ విధంగా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. ఈ పట్టు రాష్ట్ర విభజనతో సడలి, తెలంగాణ కమ్యూనిస్టులకు కొత్త స్వేచ్ఛావాయువులు లభిస్తున్నట్లు తోస్తున్నది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలలో అంతర్గతంగా చాలా వత్తిడిని సృష్టించింది. సమైక్య వాదాన్ని వదలుకోవాలని, భాషా సూత్రాలు ఈ సందర్భానికి వర్తించవని తెలంగాణకు చెందిన సిపిఐ, సిపిఎం వాదులు చాలానే వాదించారు. ఆ వాదనకు, సిపిఐలో తగినంత ప్రజాస్వామ్యం ఉన్నందున ఎక్కువ అవకాశం లభించింది. సిపిఎంలో స్టాలినిస్టు లక్షణాలు హఠం వేసుకుని కూర్చున్నాయి గనుక అతికొద్దిపాటి అవకాశమే లభించింది. విచిత్రమేమంటే, జార్జియాకు చెందిన స్టాలిన్ ఒక్కడే జార్జియన్ భాషకు చెందిన ప్రజలే ఆర్థిక- రాజకీయ విభేదాలతో హోరాహోరీ యుద్ధాలకు తలపడిన అనుభవాలను గమనించిన మీదట, ప్రజలను కలిపి ఉంచేందుకు భాష ఒక్కటే చాలదని స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ అదే స్టాలిన్ పేరిట భాషా సూత్రాలను వక్రీకరించిన సిపిఎం, స్టాలినిస్టు వ్యవహరణతో తెలంగాణలో తన కామ్రేడ్లను స్వేచ్ఛగా మాట్లాడలేని స్థితిలోకి నెట్టింది. మరొకవైపు సిపిఐ నాయకత్వం (స్వయంగా చండ్ర రాజేశ్వరరావు), భాష పేర ఈ కృత్రిమ ఐక్యత నిలిచేదికాదని 1969-70 ఉద్యమ కాలంలోనే సూచనాప్రాయంగా చెప్పినా, తెలంగాణ అనుకూల నిర్ణయానికి 40 సుదీర్ఘ సంవత్సరాలు తీసుకుంది. పైన అనుకున్నట్లు సిపిఐలోని ప్రజాస్వామికత కారణంగా నెమ్మదిగానైనా డెమోక్రటిక్ సెంట్రలిజం అర్ధవంతంగా పనిచేసింది. పార్టీ అధికారికంగా తెలంగాణను బలపరచింది. కాని సిపిఎం నాయకత్వానికి డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే మెజారిటీవారు మైనారిటీని తొక్కివేయటమనే సంకుచిత, అప్రజాస్వామిక స్ఫూర్తి మాత్రమే కన్పించింది. అది ఆ పార్టీ నాయకత్వానికి ఆబ్జెక్టివ్‌గా కన్న సబ్జెక్టివ్‌గా అనుకూలమైంది గనుక. కనుక చివరివరకు తెలంగాణ సిపిఎం శ్రేణులు నిస్సహాయంగానే మిగిలాయి. వాస్తవానికి తమ వైఖరి సరైనదికాదన్న చారిత్రాత్మక విధాన సవరణను సిపిఎం ఇంకా చేసుకోవలసే ఉంది. ఇవన్నీ ఇట్లుండినప్పటికీ, విభజనతో సిపిఐకి, అంతకన్న కొన్ని రెట్లు ఎక్కువగా సిపిఎంకు తెలంగాణలో, కొత్త ఊపిరులు తీసుకోగలుగుతున్నట్లు తోస్తున్నదేమోననే అభిప్రాయం బయటినుంచి చూస్తున్న వారికి కలుగుతున్నది. ఒకవైపు ఈ స్థితి, మరొకవైపు పైన చెప్పుకున్న విధమైన తెలంగాణ పరిస్థితులు, నేపథ్యం వారిపుడు చేస్తున్న కొత్త ప్రయత్నాలకు ప్రేరణను ఇస్తుండవచ్చు. పరస్పర మైత్రికి, ఐక్యకార్యాచరణకు లోగడ ప్రయత్నించి విఫలమైనదానికి, ఈసారి జరుగుతున్న ప్రయత్నాలకు మధ్య వ్యత్యాసం ఉందేమోనని కొద్దిగానైనా అనిపించటానికి కారణం ఇదే. కనుక వారిక చేయగలదేమిటో వేచి చూడవలసి ఉంది. ఇప్పటికైతే కొన్ని వారాల క్రితం పది వామపక్షాలు కలిసి ఒకసారి సమావేశమై కార్యక్రమం ఒకటి రూపొందించుకున్నాయి. తర్వాత అన్ని జిల్లాలలో సమావేశాలు జరిపాయి. ఆమధ్య కాలంలో, తర్వాత కూడా గతంలో లేని విధంగా పార్టీయేతర సంఘాలతో, వ్యక్తులతో సమావేశమై వారి సూచనలను తీసుకుంటున్నాయి. దీనంతటి అర్థం తెలంగాణ సిపిఐ, సిపిఎంలకు ‘స్వతంత్రం’ లభించిందని, వారి కేంద్ర పార్టీలనుంచి, విధానాలనుంచి నియంత్రణ ఉండదని కాదు. అది సాధ్యంకాదు, వాంఛనీయమూ కాదు. కాని, ఒకసారి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవహరణలో, స్థానిక నిర్ణయాలలో, విధానాలలో తగినంత వెసులుబాటు తప్పక లభిస్తుంది. అందులో సహజంగా లభించేది కొంతయితే, ఇక్కడి నాయకత్వాలు ప్రయత్నించి తీసుకునేది మరికొంత ఉంటుంది. అంతేకాదు. కొత్త వాస్తవాలను, తెలంగాణ ఉద్యమ అనుభవాలను గ్రహించి ఆ రెండు పార్టీల కేంద్ర నాయకత్వాలు కూడా తగినంత సడలుబాటు చూపటం వారికే మంచిది. ఈమాట ముఖ్యంగా, తమ కంచుకోటలో మూడవ స్థానానికి పడిపోయే సూచనలు ఆరంభమైన సిపిఎంకు వర్తిస్తుంది. ఇకపోతే, మరొక స్థాయిలో ముఖ్యమైన ప్రశ్నలు ఈ వామపక్ష శిబిరానికి ఇపుడు ఎదురవుతున్నాయి. ఈ కూటమికి యథాతథంగా ఉన్న బలమెంత? వారు వివిధాంశాలపై తీసుకునే వైఖరి ఏమిటి? అందుకు చూపే పరిష్కారాలేవి? వాటిని ప్రజలెంతవరకు ఆహ్వానిస్తారు? ఆ కార్యక్రమాల ప్రకారం వారు ఇంతకాలపు, లేదా ఇటీవలి సంవత్సరాల కాలపు పిక్నిక్ స్టైల్ ఆందోళనలకు మించి, కెమెరాల ఆకర్షణలను దాటి, ఇకముందు చేసేదేమిటి? ప్రజలకు తమ పట్ల పోయిన విశ్వాసాన్ని ఏ విధంగా పొందగలుగుతారు? సాధారణ ప్రజలలో, తగినంత పరిజ్ఞానం గలవారిలో తమ విధానాల గురించి గాని, వైఫల్యాల గురించి గాని ఉన్న ప్రశ్నలకు ఏ వివరణలిస్తారు? తెలంగాణలో తలెత్తే అంశాలపై ఏ వైఖరి తీసుకుంటారు? అనే తరహా ప్రశ్నలు చాలా ఉంటాయి. ఇందులో ఉదాహరణకు చివరి ప్రశ్నను తీసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికోసమని ఇంచుమించు ఆర్థిక సంస్కరణల మార్గంలోనే వెళుతున్నది. దానిని వ్యతిరేకించకుండా ఉండలేరు. వ్యతిరేకిస్తే పశ్చిమ బెంగాల్ మాటేమిటన్న ప్రశ్న వస్తుంది. ఈ ఇబ్బందికరమైన ప్రశ్నను లోగడ చంద్రబాబు, రాజశేఖరరెడ్డి లేవనెత్తినపుడు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి అదే ప్రశ్న వేస్తే ఏమంటారు? భూసేకరణల గురించి కూడా నందిగ్రామ్ ప్రస్తావనకు వస్తుంది. అందువల్ల, ఇల్లు అలకటం మంచిదే గాని అలకగానే పండగ అయిపోదు. నేలను చదునుచేయటం అవసరమేఅయినా అంత మాత్రాన సభ విజయవంతమై సభికులంతా తమకు ఓటువేసి అధికారం అప్పగించరు. ఇవన్నీ చేదు నిజాల వంటివి. అనగా, అనుకూలాలను, ప్రతికూలాలను జాగ్రత్తగా మదింపు వేసుకుని, అవగాహనతో, ఓపికతో, శ్రమతో, ఐక్యతతో అన్నింటికి సమాధానాలను కనుగొంటూ, స్వల్ప- మధ్యమ- దీర్ఘకాలిక దృష్టులతో ముందుకు సాగగలిగితేనే ఈ శిబిరానికి భవిష్యత్తు ఉంటుంది. ఈ పనులు ఎంత చేయగలిగితే అంత భవిష్యత్తు ఉంటుంది. మొత్తానికి తెలంగాణ వామపక్షాలకు ఇదొక అవకాశం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున లభించిన అవకాశం. ఈ కొత్త ఆరంభాన్ని వారు ఏవిధంగా ముందుకు తీసుకుపోగలరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: