హుదూద్ తుఫాన్‌తో ఉత్తరాంధ్ర అంతటా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌కోతో పాటు పవర్ గ్రేడ్ కార్పోరేషన్‌కు చెందిన భారీ టవర్లు కూడా నేలకూలడంతో పునరుద్ధరణ ఇబ్బందికరంగా మారింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలడం కూడా పునరుద్ధరణ పనులకు ఆటంకంగా మారాయి.ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వత్తిడి అధికం కావడంతో ట్రాన్స్‌కో, పవర్ గ్రేడ్ కార్పోరేషన్ ఉన్నతాధికారులు తమ సిబ్బందిని భారీ ఎత్తున జిల్లాకు తరలించి విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. విద్యుత్ పునరుద్దరణ పనుల్లో ఏపీ సర్కారు చురుగ్గా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ సద్వినియోగం చేసుకుంటోంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద దాదాపు ఎక్కువ శాతం టవర్లు నేలకూలడం వల్ల పునరుద్దరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రత్యేకించి కొన్ని టవర్లు కొండ ప్రాంతాల్లో గుట్టల్లో ఉండటం వల్ల వాటిని పునరుద్ధరించడం విద్యుత్ సిబ్బందికి కత్తిమీదసాములా మారింది. ప్రత్యేకించి విశాఖ ప్రాంతానికి ఆయువుపట్టైన సింహాచలం ప్రాంతంలోని టవర్లు కొండపైన ఉండటం వల్ల వాటిని తిరిగి నిలబెట్టేందుకు సర్కారు హెలికాప్టర్ ను వినియోగించింది. నౌకాదళానికి చెందిన ఈ హెలికాప్టర్ ను విద్యుత్ పునరుద్ధరణకు వినియోగించడం ఇదే మొదటిసారి. భారీ టవర్ కు సంబంధించిన టన్నుల కొద్దీ విడిభాగాలను కొండపైకి చేర్చాలంటే చాలా సమయం పడుతుంది. పునరుద్దరణ చాలా స్లోగా జరుగుతుంది. అందుకే ఏపీ సర్కారు పెద్దలు.. కేంద్రశాఖల సహకారం తీసుకున్నారు. నౌకదళంతో మాట్లాడి వారి హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. విద్యుత్ పునరుద్దరణలో జరుగుతున్న జాప్యాన్ని జనం అర్థం చేసుకుంటూనే.. ట్రాన్స్ కో అధికారుల ప్రయత్నాలను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: