మహారాష్ట్రలో బిజెపి లెజిస్లేటర్ల సమావేశం సోమవారం జరిగే వీలుంది. అత్యధిక స్థానాలు గెల్చుకున్నప్పటికీ మహారాష్ట్రలో బిజెపి ఇప్పటికీ ప్రభుత్వ స్థాపనలో వేగంగా ముందుకు వెళ్లలేకపోతోంది. ప్రభుత్వ స్థాపనకు అవసరమైన మిత్రపక్షంగా ఏ పార్టీని ఎంచుకోవా లనే అంశంపై ఆ పార్టీ ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదు. అయితే ఈ ప్రభుత్వ స్థాపన ప్రక్రియను వేగవంతం చేసుకోవాలని, లేకపోతే ఇది ప్రతిష్టంబనకు దారితీస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనితో కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేల కీలక సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజులుగా దీపావళి పండుగ సంబరాలు ఉండటంతో రాజకీయ హంగామాలకు ఎమ్మెల్యేలు, నేతలు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రధానంగా ఉన్న పోటీదార్లలో దేవేంద్ర ఫద్నావిస్‌ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఆయ న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కావడంతో ఆయనకే సిఎం పదవి దక్కుతుందని భావిస్తున్నారు.  అయితే సోమవారం జరిగే బిజెపి లెజిస్లేచర్ల సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. సోమవారం నుంచే రాజకీయ హడావిడి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్‌సిపి, శివసేనలలో ఏ పార్టీ నుంచి బిజెపి మద్దతు పొందుతుంది? ఎటువైపు మొగ్గు చూపుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే శివసేననే బిజెపి తిరిగి పాతమిత్రపక్షంగా ఆదరిస్తుందని, ప్రభుత్వ స్థాపన తేలిగ్గా జరిగి పోతుం దని బిజెపి వర్గాలు తెలిపాయి. ఆర్‌పిఐ నేత రామ్‌దాస్‌ అతావాలే విలేకరులతో మాట్లాడుతూ తాను శివసేన నేత ఉద్దవ్‌ థాకరేను కలిశానని , బిజెపితో దోస్తానాకు ఆయన ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఎలాగూ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే ధీమాతో ఉన్న బిజెపి వారు ఇప్పుడు ఎవరెవరికీ ఏయే మంత్రిత్వశాఖలు అనే అంశంపై దృష్టి పెడుతున్నాయి. అసెంబ్లీలో బిజెపికి 122 మంది ఎమ్మెల్యేల బలం వచ్చింది. ప్రభుత్వ స్థాపనకు తాము సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌రావుకు వారు తమ సంసిద్ధత తెలియచేసేందుకు వీలుంది. ఎన్‌సిపి వారు ఓ వైపు బేషరతు మద్దతు ఇస్తామని ముందుకు వచ్చారు. ఇక శివసేనతో పొత్తు ఎప్పటికైనా ప్రమాదకరమనే ఆలోచన కూడా బిజెపిలో ఉంది. ఈ దశలో రెండు పార్టీలను కాదని ఇండిపెండెంట్లు చిన్నపార్టీల మద్దతుతో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలనే ఆలోచన కూడా బిజెపిలో ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: