ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంపై దృష్టి సారించింది. శనివారం నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన రెండు కమిటీలు జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నాయి. పార్టీని బలోపేతం చేయటం, స్థానిక ప్రజా సమస్యలపై ఆందోళనా కార్యక్రమాల రూపకల్పనపై ఈ కమిటి ప్రధానంగా కసరత్తు చేయనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల పర్యటన మొదలవుతోంది. ఈ పర్యటన కోసం ముగ్గురు సభ్యులతో కూడిన రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాద్ రాజు, విజయ సాయి రెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటి ఎనిమిది జిల్లాల్లో పర్యటించనుంది. శనివారం కృష్ణ జిల్లా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న చిత్తూరు, 30న కడప, 31న అనంతపురం, నవంబర్ ఒకటిన కర్నూలులో ఈ కమిటీ పర్యటిస్తుంది. ధర్మాన ప్రసాద్ రావు, పార్ధసారధి, జ్యోతుల నెహ్రూతో కూడిన మరో త్రిసభ్య కమిటి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తుంది. ఆయా జిల్లాల కన్వీనర్లు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల స్థాయి ముఖ్య నేతలు, వివిధ విభాగాల నాయకులతో ఈ కమిటి సభ్యులు సమావేశం అవుతారు. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయటం, ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఒత్తిడి తీసుకురావటం, ప్రజా సమస్యల పై ఆందోళనా కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల పై ఈ కమిటి ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలను మాత్రం పర్యటన నుంచి మినహాయించారు. హుడ్ హుడ్ సహాయ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ఉన్నందున ఈ జిల్లాల్లో తర్వాత పర్యటించనుంది కమిటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: