తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఉన్న ఏకైక మేథావి జయప్రకాశ్ నారాయణ.. మేథావి రాజకీయాలకు సూట్ కాడో.. ఒక్క జ్ఞానంతోనే రాజకీయాల్లో నెగ్గుకురాలేమో తెలియదు కానీ.. ఈయన తన పార్టీకి ప్రజల మద్దతు సాధించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఆయనైనా అసెంబ్లీలో సభ్యుడిగా ఉండి.. పార్టీ ఉనికిని అప్పుడప్పుడు చాటుతుండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం వల్ల.. ఆ పార్టీ పేరు క్రమంగా జనం మరచిపోయే పరస్థితి నెలకొంది. మళ్లీ చాలారోజుల తర్వాత జేపీ.. మీడియా ముందు కనిపించారు. లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా ప్రసంగించిన జేపీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. ఇద్దరూ వాజమ్మలేనంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. సాధారణంగా సంయమనంతోనే మాట్లాడే జేపీ.. కాస్త బ్యాలన్స్ తప్పారు. ఇధ్దరు సీఎంలూ ప్రజాసంక్షేమానికి అనుగుణంగా నడుచుకోకుండా.. జనం మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని విమర్శించారు. అటు చంద్రబాబు.. ఇటు కేసీఆర్ ఇద్దరూ.. సాధ్యంకాని హామీలిచ్చి.. అమలు చేయకుండా నాటకాలాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. జేపీ రాకతో తెలుగు రాజకీయాలు బాగుపడతాయని ఆశించిన చాలామందికి నిరాశే ఎదురవుతోంది. మొన్నటి ఎన్నికల తర్వాత జేపీ కూడా రాజకీయాలపై ఆశలు వదులుకున్నారో ఏమోగానీ.. పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అధికారంతో సంబంధం లేకుండా... పార్టీని ఎప్పుడు ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యతను ఆయన విస్మరిస్తున్నారేమో అనిపిస్తోంది. ఇటు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు.. కరెంట్ సమస్య.. అటు ఏపీలో హుదుద్ తుపాను.. వంటి సమస్యలున్నప్పుడు... పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి.. కార్యక్రమాలు నిర్వహిస్తే.. అది కాస్త జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా ప్రెస్ మీట్లకు సభలకే పరిమితమైతే.. ఆయన సాధించేదీ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: