రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలకు హాజరు కాబోతున్న వారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. ఇంటర్ బోర్డు ఇంకా పూర్తిస్థాయిలో విభజనకాకపోవడం వల్ల.. ఇప్పుడు పరీక్షల నిర్వహణపై వీరిలో అయోమయం నెలకొంది. దీనికితోడు.. ఉన్నత విద్యామండలి నిర్వహించే ఎంసెట్ రాష్ట్ర పునర్విభజన పదో షెడ్యూల్ లో ఉంది. జేఈఈ కి తెలుగు వారి రాష్ట్రాల నుంచి ఇంటర్ మార్కుల పర్సంటైల్ గణాంకాలను అందించడంలో ఇబ్బందులున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిసతే... ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలను రెండు రాష్టాలూ ఉమ్మడిగానే నిర్వహించుకుంటే మేలు. ఐతే.. ఇటీవలే.. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డులో ఉన్న నిబంధనలన్నీ వర్తిస్తాయని తెలిపింది. పబ్లిక్ పరీక్షల నిర్వహణ, పాఠ్యపుస్తకాల తయారీ, కళాశాలల అనుబంధ గుర్తింపు, పట్టాల జారీ వంటివి ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నమాట. ఐతే ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయింది కాబట్టి.. పరీక్షల నిర్వహణ ఉమ్మడిగా చేస్తేనే మేలన్నది ఏపీ వాదన. ఈ అంశాలపై కలసి మాట్లాడుకునేందుకు రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్వర్ రెడ్డి సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచింది. పరీక్ష ఒకటే అయినా ఏ రాష్ట్రం పేపర్లు ఆ రాష్ట్రంలోనే మూల్యాంకన జరిగేలా చూద్దామని అందులో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఉమ్మడి పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ వచ్చింది. ఈ వివాదం గత రెండు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నడుస్తోంది. ఈ వివాదం వల్ల ఇప్పటికే వార్షిక ప్రశ్నా పత్రాల తయారీ, ముద్రణకు సంబంధించి టెండర్లు ఖరారు పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా అవి నిలిచి పోయాయి. సకాలంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో సాధ్యమేనా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇద్దరు మంత్రులు..వీటన్నింటికీ పరిష్కారం కనుగొంటారా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: