అన్నదాత మళ్లీ ప్రయివేటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.రైతులకు బ్యాంకులందించే వ్యవసాయ రుణాలు గత పదేళ్లలో లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత ఏడాది రాష్ట్ర రైతులకు బ్యాంకులు రూ. 37,058 కోట్ల రుణాలు ఇవ్వగా.. ఈ ఏడాది కేవలం రూ. 9,808 కోట్లు మాత్రమే ఇచ్చాయి. కౌలు రైతులకు కేవలం రూ. 42 కోట్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 25,888 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించుకున్నారు. అందులో మూడో వంతు రుణాలు ఇవ్వడమే గగనమైంది. టర్మ్ రుణాలు, అనుబంధ రంగ రుణాలు కూడా ఈ ఏడాది రూ. 14,041 కోట్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటికి అందులో ఐదో వంతు ఇవ్వలేదు.దీంట్లో తమ తప్పేమీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బ్యాంకర్ల మాట. రుణాలన్నీటినీ మాఫీ చేస్తామన్న టీడీపీ సర్కారు హామీ అమలు చేయకపోవటం,రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పటం వల్ల రైతులు డిఫాల్టర్లుగా మారారని.. దీంతో కొత్త రుణాలు ఇవ్వటం సాధ్యం కాదని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు పెట్టుబడుల కోసం రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వారి అధిక వడ్డీ మరింత కుంగదీస్తోంది. ఇంకోవైపు సర్కారు నిర్వాకం వల్ల పంటల బీమా దక్కలేదు. అన్నదాత దశాబ్ద కాలం తర్వాత మళ్లీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. కొత్త రుణాలు దొరకని దయనీయ పరిస్థితి......... ----------------------------------------------- రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం కోసం బ్యాంకు రుణాలు లభించేదే చాలా కొద్ది మందికి. అత్యధికులు ప్రయివేటు అప్పులపైనే అధారపడి సాగుచేస్తుంటారు. కానీ.. ఈ ఏడాది ఆ కొద్ది మంది రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందకుండా పోయాయి. రుణాలు చెల్లించొద్దని ఏకంగా సీఎం పిలుపునివ్వడం వంటి కారణాలతో రైతులు ఖరీఫ్ కాలంలో కష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. కొత్త అప్పులు పుట్టక రైతులు సంక్షోభం ఎదుర్కొంటారని.. ప్రయివేటు అప్పుల్లో కూరుకుపోతారని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదు నెలలుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని దుస్థితి... ---------------------------------------- వ్యవసాయ రంగంలో బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు ఏటేటా పెరగాల్సిందిపోయి.. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా అప్పులు ఇవ్వలేదు. గత పదేళ్లతో పోల్చితే రైతులకు ఏనాడూ ఇంత తక్కువగా రుణాలిచ్చిన పరిస్థితి లేదు. నిజానికి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యానికి మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో స్వల్ప కాలిక, టర్మ్, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 31,877 కోట్లుగా ఉండగా.. దాదాపు రూ. 4,000 కోట్లు అధికంగా మంజూరు చేశారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,654 లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. లక్ష్యాన్ని దాటిపోయి రూ. 50,060 కోట్లు మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 47,017 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా.. అదికూడా అధిగమించి రూ. 49,774 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 25,888.01 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా.. ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్టంగా కేవలం రూ. 9,808 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక వ్యవసాయ టర్మ్, అనుబంధ రంగాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,041.41 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 2,569.27 కోట్లు (18 శాతం) మాత్రమే మంజూరు చేశారు. అసలే సీజన్ అనుకూలించక రైతులు అనేక ఇబ్బందులు పడగా కనీస పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి నామమాత్రంగా కూడా రుణాలు అందకపోవడంతో రైతాంగం ఈసారి ఎక్కువగా అధిక వడ్డీకి ప్రైవేటు రుణాలపై ఆధారపడ్డారు. ఇక రాబోయే సీజన్‌లో రైతులకు ఆ మాత్రం అప్పులు దొర కడం కూడా కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ రుణాలు, ఖరీఫ్‌ సీజన్‌, టీడీపీ, కొత్త రుణాలు, Agricultural loans, Kharif season, tdp, New loans

మరింత సమాచారం తెలుసుకోండి: