రాష్ట్ర రాజధానిని ఐదేళ్ల సమయంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాజధాని సలహా సంఘం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా భూ సమీకరణ, రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిని 30 వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలపరిమితిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూడా సీఎం చంద్రబాబు కమిటీ సభ్యులతో పేర్కొన్నట్లు సమాచారం. రాజధాని కోసం అవసరమైన భూసేకరణను ల్యాండ్ పూలింగ్ ద్వారానే సమీకరించాలని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. భూ సేకరణ వలన రైతులు నష్టపోతారనే భావనతోనే వారికి సమాయం అందించే విధంగా భూ సమీకరణ జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రైతులు ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణకు ముందుకు రాకపోతే భూసేకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా చేపట్టిన భూముల్లో 50 శాతం ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాజధాని సలహా కమిటీ అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూ సమీకరణలో ప్రధానంగా జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో భూ యజమానులను ఒప్పించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం ఉద్భోదించారు. భూ యజమానులకు ఎకరానికి 25 వేల రూపాయల ఆదాయం ఉండేలా దీనిపై ప్రతియేటా ఐదు శాతం పెంపుతో చెల్లించాలని నిర్ణయించారు. పదేళ్లపాటుకానీ, మొదటి బదలాయింపు వరకు కానీ, ఈ ప్రోత్సహాలను చెల్లిస్తారు. దీంతో పాటు రైతులకు ల్యాంగ్ పూలింగ్ కు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేస్తారు. దీంతో వారికి ఎక్కడైనా భూములు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీతోపాటు, రిజిస్ట్రేషన్ ఫీజులు, నాలా చార్జీలను కూడా మినహాయించాలని నిర్ణయించారు. అసైన్డ్ భూముల విషయంలో 70:30 శాతం నిష్పత్తిలో భూములు సమీకరించాలని నిర్ణయించారు. భూ సమీకరణలో భూములు కోల్పోయినవారు, భూమిలేని నిరుపేదలు జీవనోపాధి కోల్పోయినట్లయితే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారిలో నైపుణ్యాలను అభివ్రుద్ధి చేసి వారికి ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణను ఇప్పించనున్నారు. లే ఔట్ ప్లాన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే భూ బదలాయింపు సర్టిఫికెట్లను భూ యజమానులను అందిస్తారు. విజయవాడ, గుంటూరు సుందరీకరణ ప్రతిపాదనలను వెంటనే రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంత అభివ్రుద్ధి ప్రాధికార సంస్థ నోటిఫై కాగానే ప్రస్తుతం కొనసాగుతున్న వీజీటీం ఉడా రద్దవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: