ఏజన్సీ వాసుల చిరకాల స్వప్నం ఫలించ బోతోంది. భద్రాచలం నుంచి గోదావరి నదిపై జలమార్గం ద్వారా తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి వరకు జలమార్గానికి కేంద్రం సిగ్నల్‌ ఇవ్వడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 4వ జాతీయ జల రవాణా ప్రాజెక్టు కింద రూ.1500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ జల మార్గం పనులను నవంబర్‌లో ప్రారంభించి ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించడంతో అతి త్వరలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రాజెక్టు మంజూరు కావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపులే కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అయితే ఖమ్మం జిల్లా, ఏజన్సీలోని 7 మండలాలు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని పది మండలాల ప్రజలకు ఈ జల రవాణా మార్గం ఓ వరంలా మారనుంది. ఏజన్సీ ప్రాంతాల ప్రజలు సరుకుల రవాణాకు, అటవీ ఉత్పత్తుల విక్రయాల కోసం గిరిపుత్రులు ఇప్పటి వరకూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. జల మార్గం సుగమం కావడంతో ఇప్పుడు ఏజన్సీ వాసుల రవాణాకు ఈ జల మార్గం సులభతరం చేయనుంది. అయితే నియోజక వర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధిక స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతం ఉండటంతో ఈ రవాణా మార్గం ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: