కరెంటు కష్టాల కారణంగా.. కేసీఆర్ సర్కారుపై rఐదునెలల్లోనే వ్యతిరేకత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వస్తే తమ రాత మారుతుందనుకున్న ఎన్నో వర్గాలకు.. ఆ ఆశలు ఇప్పట్లో నెరవేరకపోగా.. కరెంటు కోతలు మాత్రం చికాకుపెట్టిస్తున్నాయి. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ఈ కరెంటు కోతలకోసమేనా అని అంతా విసుక్కునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి.. మేం ముందే చెప్పాం కదా.. అని టీఆర్ఎస్ నేతలు బుకాయిస్తున్నా.. అలా ఎక్కువ కాలం జనానికి సమాధానం చెప్పలేమని వాళ్లకూ క్రమంగా అర్థమవుతోంది. అందుకే కరెంటు కష్టాల నివారణ కార్యాచరణపై గులాబీ ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెడుతోంది. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని తిట్టడం ద్వారా ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేమన్న సంగతి గులాబీ నేతలకూ తెలుసు. అందుకే.. విద్యుత్ కొనుగోలు.. విద్యుత్ ఒప్పందాల దిశగా అడుగులు వేస్తోంది. కరెంటు విషయంలో అండగా నిలుస్తామన్న చత్తీస్ గడ్ ప్రభుత్వంతో ఒప్పందం కోసం టీఆర్ఎస్ సర్కారు తహతహలాడుతోంది. వెయ్యి మెగావాట్ల.. ఒప్పందం కుదుర్చుకునేందుకు త్వరలో కేసీఆర్ చత్తీస్ గఢ్ వెళ్లనున్నారు. చత్తీస్ గఢ్ నుంచి కుదుర్చుకోనున్న ఈ వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయింది. రెండు రాష్టాల ఇంధన శాఖ కార్యదర్శులు ఇప్పటికే ప్రాధమిక చర్చలు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను చత్తీస్ గఢ్ కు పంపింది. దానికి చత్తీస్ గఢ్ ప్రభుత్వం కొన్ని సవరణలు చెబుతూ తిప్పి పంపింది. ఆ మేరకు సవరణలు పూర్తి చేసి పంపిన తెలంగాణ తర్వలోనే ఆ ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కేసీఆర్ చత్తీస్ గఢ్ పర్యటన తేదీలు ఖరారుకాకపోయినా.. సాధ్యమైనంత త్వరలోనే ఆయన చత్తీస్ గఢ్ వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: