వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా ఉన్న కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న గండి బాబ్జీ హాజరు కాలేదు. సహాయక చర్యల్లో కూడా పాల్గొనలేదు. దీంతో బాబ్జీని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గండి బాబ్జీ, కొణతాల రామకృష్ణకు ముఖ్య అనుచరుడు.  బాబ్జీని ఇన్‌చార్జ్‌గా తొలగించడాన్ని సహించలేని కొణతాల మూడు రోజుల కిందట పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను జగన్‌కు మెయిల్ ద్వారా పంపించారు. తను పార్టీలో ఉండడం ఇష్టం లేదనుకుంటే, దానికి కూడా రాజీనామా చేస్తానని కొణతాల అదే లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను అందుకున్న జగన్, కొణతాలతో చర్చించేందుకు మైసూరారెడ్డిని, సోమయాజులను నియమించారు. వారు ఫోన్ చేసినా కొణతాల అందుబాటులోకి రాలేదు. గడచిన రెండు రోజులుగా కొణతాల ఎవ్వరితోనూ మాట్లాడ్డం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌ను మంగళవారం జగన్ తన వద్దకు పిలిపించుకుని ఈ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. కొణతాలను తొలగిస్తే, ఎదురయ్యే పరిస్థితులను ఆయన అమర్‌తో సమీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: