ఉన్న గొడవలు చాలవన్నట్టు.. తెలంగాణ, ఏపీ మధ్య ఇప్పడు మరో వివాదం రాజుకుంది. చిన్నగా మొదలైన వివాదం కాస్తా.. ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లింది. ఏపీ కార్మిక శాఖ సహాయ కమిషనర్ తో పాటు మరో అధికారిపై తెలంగాణ అధికారులు పోలీస్ కేసు పెట్టారు. దీనిపై డీసీపీ విచారణ కూడా మొదలుపెట్టారు. ఉన్నతస్థాయి అధికారిని విచారణ పేరుతో పిలిపించి ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు తీరుపై గుర్రుగా ఉన్న ఏపీ అధికారులు ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసలు విషయం ఏమిటంటే.... కార్మికశాఖకు చెందిన.. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం వద్ద.. దాదాపు 1400 పై చిలుకు నిధులున్నాయి. ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధించినవి.. వీటిని విభజన చట్టం ప్రకారం పంచుకోవాల్సి ఉంది. దీని కోసం ఓ అథారిటీని ఇంకా ఏర్పాటు చేయలేదు. ఈ లోపుగానే ఏపీ అధికారులు.. వివిధ ఖాతాల్లో ఉన్న ఈ నిధులను ఓకే ఖాతాలోకి మార్చి.. తెలంగాణ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హైదరాబాద్ లో ఉన్న ఆ ఖాతాను విజయవాడ ఖాతాకు మార్చేశారు. ఈ విషయం గమనించిన తెలంగాణ అధికారులు.. ఏపీ అధికారులపై హైదరాబాద్ మధ్య మండలానికి చెందిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు ఏపీ కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేసి వివరాలడిగారు. సచివాలయానికి వచ్చి జీబులో ఎక్కించుకుని.. తెలంగాణ కార్మికశాఖ అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వదిలిపెట్టారు. దీనిపై ఆగ్రహించిన ఏపీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ కమిషనర్ సంరక్షణలో ఉన్నాయని డిప్యూటీ కమిషనర్ మురళీసాగర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ సూచనల మేరకే హైదరాబాద్ బ్యాంకులో ఉన్న 406 కోట్ల రూపాయల నిధులను విజయవాడ బ్యాంకుకు తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ ను కలిసి వివరణ ఇస్తారట. పనిలో పనిగా తెలంగాణ పోలీసులు తీరుపై కూడా కంప్లయింట్ చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: