తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం మారిపోనుందా.. జయలలిత, కరుణానిధిల శకం ముగిసి కొత్త రాజకీయ శకం మొదలవబోతోందా.. తాజా రాజకీయ పరిస్థితులను సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నాడా.. ఈ ప్రశ్నలు ఇప్పుడు తమిళనాట ఆసక్తిరేపుతున్నాయి. జయలలిత మరో పదేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు కావడంతో.. రాజకీయ రంగ ప్రవేశానికి రజనీకాంత్ అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా.. లింగా ఆడియో వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.                                   తమిళనాడులో రజనీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. 60 ఏళ్లు దాటినా ఇంకా ఒక్క సినిమాకు ఆయన 60 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన మేనియా ఎంత ఉందో. ఓవైపు అక్రమార్కుల కేసులో ఇరుక్కుపోయిన జయలలిత.. మరోవైపు వయోభారంతో చక్రాల కుర్చీకే పరిమితమైన కరుణానిధి.. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ యవనికపై వాక్యూమ్ కనిపిస్తోంది. రజనీకాంత్ వంటి క్రేజీ స్టార్ పొలిటికల్ ఎంట్రీకి ఇదే అనువైన సమయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. నిన్న మొన్నటివరకూ రాజకీయ రంగ ప్రవేశంపై అంతగా ఆసక్తి చూపని రజనీ కూడా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడట.                              నాకు రాజకీయాలంటే భయం లేదు.. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ లింగా ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ స్పష్టం చేశాడు. రాజకీయాల్లోకి రావాలంటే ఎంత ధైర్యం కావాలో నాకు తెలుసు.. చాలామందిని దాటుకుని వెళ్లాలి.. ఇవన్నీ సాధించిన తర్వాత మంచి చేయగలమా అని ఆలోచించాలి.. ఆ ఆలోచనతోనే కాస్త వెనుకాడుతున్నా.. అని లింగా ఫంక్షన్లో రజనీకాంత్ అన్నారు. ఈ మాటలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోయిందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. వచ్చే ఎన్నికలతో రజనీకాంత్ తమిళనాడు సీఎం కావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: