ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏపీని సింగపూర్ గా మారుస్తానన్నారు.. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చేపనిలో పడ్డారు. అందుకే తొలివిదేశీ పర్యటన కోసం సింగపూర్ వెళ్లారు. అక్కడి మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలతో చర్చించారు. రాష్ట్రాభివృద్దిపై సలహాలు అడిగారు. మూడు రోజుల పర్యటన విజయవంతమైందని ప్రకటించుకున్నారు. సింగపూర్ కూడా ఏపీ లాగానే విడిపోయిందని.. తర్వాత స్వయం శక్తితో అభివృద్ధి చెందిందని సెలవిచ్చారు. సింగపూర్ స్ఫూర్తితో ఏపీ మరో సింగపూర్ కావాలని ఆకాంక్షించారు.                              అంతవరకూ బాగానే ఉంది.. కానీ చూస్తుంటే చంద్రబాబు సింగపూర్ జపం మరీ ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఏకంగా రాజధాని నిర్మాణ బాధ్యతను కూడా సింగపూర్ ప్రభుత్వానికే అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు ఆయన ప్రకటించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రతిపాదనపై సింగపూర్ మంత్రులతో మాట్లాడానని చంద్రబాబు చెబుతున్నారు. వారు తమ ప్రధానితో మాట్లాడి చెబుతామన్నారట. అంటే వాళ్లు ఓ కే అంటే ఇక ఏపీ రాజధాని సింగపూరే కట్టిస్తుందన్నమాట.                              చంద్రబాబు అంతటితో ఆగలేదు. రాయలసీమకు పోలవరం నీటిని రప్పించే ప్రాజెక్టు విషయంలోనూ సింగపూర్ ప్రభుత్వాన్ని సలహా అడిగామని చంద్రబాబు చెప్పుకున్నారు. ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు ఎంత ఖర్చవుతుంది... అనే ప్రతిపాదనలతో తమను సంప్రదించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని అడిగారట. వారి స్పందన బట్టి నిర్ణయం తీసుకుంటారట.                         అంతకుముందు కూడ మెట్రో రైళ్ల నిర్మాణంలోనూ సింగపూర్ సాయం తీసుకుంటామన్నారు. అంతే కాదు ఏపీలో సెజ్ ల ఏర్పాటు, కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు మెరుగుదల వంటి విషయాల్లోనూ సింగపూర్ ప్రభుత్వంతో చర్చించారట. ఇలా అన్నింటికీ ఒకే దేశంపై ఆధారపడటం కూడా అంత మంచిదికాదంటున్నారు విశ్లేషకులు. చూస్తుంటే.. ఇక ఏపీ పరిపాలన కూడా సింగపూర్ ప్రభుత్వానికే అప్పగిస్తారేమోనని మరికొందరు వ్యంగ్య బాణాలు విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: