ఏపీ రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి.. ఎకరం ధర లక్షలు దాటి కోట్లుకు చేరుతోంది. తుళ్లూరు మండలంలో చాల ఎకరం ధర కోటిరూపాయలు దాటింది. మరోవిశేషం ఏమిటంటే.. భూముల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగిపోతున్నాయి. కేవలం రోజుల వ్యవధిలోనే లక్షల రూపాయలు తేడా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ ఇక్కడే ఉండటం... రాజధాని నిర్మాణం పూర్తయితే పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభం వస్తుందన్న అంచనాలు రేట్లను పెంచేస్తున్నాయి.                                       రాజధాని ప్రాంతంపై మీడియాలోనూ విపరీతమైన ప్రచారం జరగడం కూడా ఈ రియల్ భూమ్ కు ప్రధానకారణం. తమ భూములకు మంచి ధరలు వస్తుండటం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు భూములు అమ్ముకునేందుకు ముందుకొస్తున్నారు. మరికొందరు ఇక్కడ భూములు అమ్మి.. కాస్త దూరంలో అంతకు మూడు, నాలుగు రెట్ల విస్తీర్ణంలోని భూములు కొంటున్నారు. ఇంకొందరు ఇంకా ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఎదురుచూస్తున్నారు. సర్కారు ఇచ్చే ప్యాకేజీలో మార్పులుంటాయని ప్రచారం జరుగుతుండంతో కొందరు రైతులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.                                ఐతే.. రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనడం మంచిదేనా అన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జరుగుతోంది. భూమ్ పేరుతో దళారులు పోటీపడి ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రాజధాని ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే అక్కడి రేట్లు హైదరాబాద్ స్థాయిలో చెబుతున్నారని.. వాస్తవానికి అంత సీన్ ఉండదని.. ఒక్కసారి ఈ భూమ్ డామ్మంటే.. కొనుగోలుదారులు భారీగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో జరగలేదని.. కొత్తరాజధానిని హైదరాబాద్ రేంజ్ లో ఊహించుకుంటున్నవారు.. అందుకు దశాబ్దాల సమయం పడుతుందని గ్రహించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: