వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలకు సాక్షి మీడియా ప్రధాన కారణం అంటే కాదనేవారు ఎవరూ ఉండరేమో.. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి జగన్ కాంగ్రెస్ లో ఓ ఎంపీ మాత్రమే. సాధారణంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయ వారసులుగా ఎదగడం చాలా తక్కువ. సాక్షి పత్రిక, ఛానల్ లేకపోయి ఉంటే..జగన్ కూడా ఓ సాధారణ ఎంపీలా మిగిలిపోయేవాడే. జగన్ ను ఎప్పటికప్పడు ఫోకస్ చేయడంలోనూ.. వైఎస్ సేవలను నిరంతరం గుర్తు చేయడంలోనూ.. వైఎస్ మరణాన్ని సానుభూతి పవనాలుగా మార్చడంలోనూ.. ఆ సానుభూతి ఏళ్లతరబడి కొనసాగించడంలోనూ సాక్షి మీడియా కీలక పాత్రే పోషించింది. ఐనా ఎన్నికల్లో మాత్రం విజయం సాధించిపెట్టలేకపోయింది.                                    ఎన్నికల తర్వాత జగన్ సొంత పత్రిక సాక్షిలో ఈమధ్య చాలా మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా సాక్షి జగన్ జపం తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో కేవలం వైఎస్సార్ పార్టీ కరపత్రంలా కనిపించే సాక్షి ఇప్పుడు స్టాండ్ మారుస్తోంది. గతంలో ముఖ్యమంత్రుల వార్తల కన్నాజగన్ వార్తలకు ప్రాధాన్యం లభించేది.. కానీ ఇప్పుడు  చంద్రబాబు వార్తలు కూడా ప్రముఖంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు..పొలిటికల్ అంశాలను వదిలేస్తే మిగిలిన విషయాల్లో ప్రత్యర్థి పత్రికలకు అందనంత క్వాలిటీ మెయింటైన్ చేస్తోంది.                                       ఎడిటర్ గా ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి చేరిన తర్వాత ఈ మార్పు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక.. కొన్నాళ్లు న్యూట్రల్ గా వెళదామనుకుంటున్నారో.. మరీ వైఎస్సార్ పార్టీ వార్తలే వేస్తే.. విశ్వసనీయత మరింత తగ్గుతుందనుకున్నారో తెలియదు కానీ.. ఈ మార్పు మంచిదేనంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ వాసులను ఆకట్టునేందుకు సాక్షి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. సిటీ ప్లస్ అనుబంధంతో హైదరాబాదీల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: