కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ పార్టీ లీడర్ ఆఫ్ తెలంగాణ... జానారెడ్డి. సీనియర్ సభ్యుడు. తెలంగాణలో కెళ్లా సీనియర్ పొలిటీషియన్. వరసగా అనేక సార్లు విజయాన్ని సాధించిన నేత. ఒకవేళ ఈ టర్మ్ లో కాంగ్రెస్ గెలిచి ఉంటే.. జానారెడ్డి ముఖ్యమంత్రి అయినా అయ్యేవాడేమో! మరి అలాంటి నేత గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లే జోకులేస్తున్నారు. ఆయనను తలుచుకొని నవ్వుకొంటున్నారు! తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. జానారెడ్డి సభకు రాని రోజున ఆయన చర్చనీయాంశం అవుతున్నాడు. సభలో కాదు.. కాంగ్రెస్ పార్టీ లీడర్లే జానారెడ్డిని తలుచుకొంటున్నారు. ఆయన తీరును చర్చించుకొంటున్నారు. అలా చేస్తూ నవ్వుకొంటుండటమే ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది! సీఎల్పీ ఉప నేత హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సీఎల్పీ చాంబర్ లో కూర్చొని.. జానారెడ్డిపై జోకులేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ లీడర్ సీట్లో కూర్చొన్న కోమటిరెడ్డి జానారెడ్డిని తలుచుకొన్నాడట! జానారెడ్డి సీఎం కావాలని అను కొన్నాడని.. చివరకు సీఎల్పీ లీడర్ అయ్యి సంతోషపడుతున్నాడని కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకొంటూ... ఆ మాత్రం దానికి కూడా జానారెడ్డి చాలా కష్టపడ్డాడని... సీఎల్పీ నేత ఎన్నిక జరిగినప్పుడు జానారెడ్డి తనకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడో లెక్కేలేదని.. ఎలాగైనా ఆ పదవిని సొంతం చేసుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డాడని.. చివరకు సాధించుకొన్నాడని ఉత్తమ్ అన్నాడు. కొంచెం వ్యంగ్యంతో.. ఆట పట్టిస్తున్నాట్టుగా సెటైర్లు వేసుకొంటూ జానారెడ్డిపై జోకులేసుకొన్నారు ఈ కాంగ్రెస్ లీడర్లు. మొత్తానికి ఈ విధంగా జానారెడ్డి తన తీరుతో వీళ్ల పాలిట కమేడియన్ గా మారాడనమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: