ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్.. ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. మీడియా ముందు తడబడతానన్న భయమో.. టెక్నాలజీని తెగ వాడేసుకుందామన్న తాపత్రయమో తెలియదు కానీ.. ప్రెస్ మీట్ల కంటే ట్వీట్ల ద్వారానే ఎక్కువగా పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాడు. మీడియా గొట్టాల ముందు పెద్దగా నోరు విప్పిన ఈ పొలిటికల్ చిన్నోడు.. ట్విట్టర్ వేదికపై చెలరేగిపోతాడు. పొలిటికల్ కౌంటర్లను ఎన్ కౌంటర్ చేస్తూ వార్తల్లోకి వస్తుంటాడు. ఏపీలో లోకేశ్ వాడినంతగా ట్విట్టర్ ఇంకే నేతా వాడడన్నది మాత్రం వాస్తవం.                                                        ఐతే.. ఈ ట్వీట్లే ఇప్పుడు చినబాబు లోకేశ్ మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రెస్ మీట్ డైలాగుల కంటే.. పొలిటికల్ ట్వీట్లే ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఐతే ట్వీట్లలో కాస్త ఘాటు డోసు పెరగడంతో వీటిని ప్రత్యర్థులు అస్త్రాలుగా మలచుకుంటున్నారు. తమ అనుబంధ సంఘాలతో కేసులు పెట్టిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, పరిపాలనపై లోకేశ్ పెట్టిన ట్వీట్ కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించారు.                                                           తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడుపుతున్నారని.. కేసీఆర్ హిట్లర్ లా పరిపాలిస్తున్నాడని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొనడమే ఈ కేసులకు కారణం. ఈ వ్యాఖ్యలను తప్పబడుతూ.. తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రవికుమార్ తో పాటు మరికొందరు కోర్టుకెక్కారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రౌడీలు పాలిస్తున్నారని రాయడం రాజ్యాంగ విరుద్దమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమేనని వారు కోర్టుకు తెలిపారు. లోకేశ్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. కొత్తపేటకు చెందిన మరో నాయకుడు కూడా ఎల్బీనగర్ ఠాణాలో ఇదే ఇష్యూపై కేసు నమోదు చేశారు. ఇకనైనా చినబాబు.. ట్వీట్ చేసేటప్పుడు కాస్త పదాలు చూసుకుని వాడటం అవసరమేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: