రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నదీ తీర ప్రాంతంలోని రైతులు భూములిస్తే ఆ భూములకు హరిహారంగా ఎకరాకు అభివృద్ధి చేసిన 1200 గజాల భూమిని రైతులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించారు. రైతుల కోరికకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. రాజధాని పరిధిలోని రైతులతో చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి లేక్‌వ్యూ అతిథి గృహంలో సమావేశమయ్యారు. భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా వారితో అన్నారు. భూములిచ్చే రైతులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తామన్నారు.  నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్యల భవిష్యత్తు అందిస్తామన్నారు. కేంద్రం నుండి వచ్చే పరిశ్రమలు తొలుత రాష్ట్ర రాజధాని నగరంలోనే ఏర్పాటవుతాయని, అందువలన ఉపాధి అవకాశాలకు ఎలాంటి డోకా ఉండబోదని ముఖ్యమంత్రి అన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారి కుటుంబాల్లో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వారికి ఎటువంటి సమస్యలున్నా తనను నేరుగా కలిసేందుకు ఓ ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గుంటూరు జిల్లా నుండి ఈ రైతులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపిక చేసుకుని లేక్‌వ్యూ అతిథి గృహానికి తీసుకువచ్చారు. కొందరు రైతులు ఎకరాకు 1200 గజాలతో పాటు అదనంగా మరో 200 గజాల వాణిజ్య పరమైన స్థలాన్ని పరిహారంగా ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: