రుణ మాఫీ లబ్ధిదారుల పరిశీలనలో సుమారు 23 లక్షల ఖాతాలు గల్లంతైనట్లు తెలిసింది. వీరందరికీ మాఫీ వర్తించే పరిస్థితి లేదు. కేవలం రేషన్‌, ఆధార్‌కార్డుల్లేని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు, అధికారుల పరిశీలన, వివరాల నమోదు ప్రక్రియ ఎట్టకేలకు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మాఫీ కోసం తొలుత బ్యాంకులు పంపిన వివరాల్లో సరైన వివరాల్లేవనేపేర ప్రభుత్వం దాదాపు 28 లక్షల ఖాతాలను తిప్పి పంపింది. ఇంటింటికీ తిరిగి తనిఖీ చేసి వివరాలు సేకరించి పంపాల్సిందిగా జన్మభూమి కమిటీలు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఆధార్‌, రేషన్‌కార్డు వివరాలు సేకరించాలని సూచించింది. లక్షల సంఖ్యలో లబ్ధిదారుల నుంచి సమాచారం సేకరించాల్సి రావడంతో మూడుసార్లు గడువు పొడిగించింది. నవంబర్‌ 18 నాటికి బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు కేవలం ఐదు లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి.  మిగతా 23 లక్షల అకౌంట్లకు సంబంధించి ఆధార్‌, రేషన్‌కార్డుల వివరాలు అందలేదు. సమాచారం కోసం రెండోసారి పంపిన ఖాతాల్లో కేవలం 18 శాతం అడిగిన వివరాలతో తిరిగొచ్చాయి. వివరాల్లేని ఖాతాలను బోగస్‌ అని ముద్ర వేసి రుణ మాఫీ జాబితాల నుంచి తొలగించే అవకాశం ఉంది. రుణమాఫీకి ఆధార్‌ తప్పనిసరికాగా, రేషన్‌కార్డులు లేకపోతే కుటుంబానికి రూ.లక్షన్నర రద్దు అనే నిబంధన అమలు చేయడం కుదరదు. ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర ద్రువీకరణ పత్రాల సాయంతో కుటుంబ సభ్యులను గుర్తించాలని జన్మభూమి కమిటీలు, గ్రామ స్థాయి అధికారులను కోరినప్పటికీ, ప్రభుత్వం తొందర పెట్టడంతో, హడావిడిగా జాబితాలు పంపారని తెలుస్తోంది.  కాగా తొలుత బ్యాంకులు 80 లక్షల ఖాతాల వివరాలను సర్కారుకు పంపాయి. వాటిలో 47 లక్షలు సక్రమంగా ఉన్నాయని, ఐదు లక్షల ఖాతాలను సాఫ్ట్‌వేర్‌ తిరస్కరించిందని అధికారులు తెలిపారు. తతిమ్మా 28 లక్షల అకౌంట్లను రేషన్‌, ఆధార్‌ కార్డుల వివరాల కోసం జిల్లాలకు తిప్పి పంపారు. అలా తిప్పిపంపిన ఖాతాల్లో కేవలం ఐదు లక్షలే సర్కారుకు అందగా, ఇప్పటికే సక్రమంగా ఉన్నాయంటున్న 47 లక్షల ఖాతాలను వాటికి కలిపితే తొలిదశ వడపోతలో 52 లక్షల ఖాతాలు అర్హత సాధించాయి. వీటిని క్రోడీకరించాల్సి ఉంది. తుది అంకానికొచ్చేసరికి ఖాతాల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: