శ్రీశైలం జలాశయంలో విద్యుత్‌ ఉత్పత్తి నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా బోర్డు స్పూర్తిని దెబ్బతీస్తోందని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఎపి ప్రభుత్వం బుధవారంనాడు ఉదయం బోర్డు చైర్మన్‌ ఎస్‌కెజి పండిట్‌కు లేఖ రాసినట్టు అధికారుల ద్వారా తెలిసింది. ఫిర్యాదు ప్రతిని బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కె గుప్తాకు కూడా పంపారు. సోమవారం నుండి తెలంగాణ ప్రభుత్వం వివిధ దశల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిని చేయరాదని కృష్ణా బోర్డు ఆదేశించిన తర్వాత విద్యుత్‌ ప్లాంట్‌ మెంటేనెన్స్‌ కోసం అప్పుడప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నా తాము పట్టించుకోలేదని, తాజాగా గత మూడు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంలో ప్రాధమ్యాలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని సరైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఆపాలని ఎపి ప్రభుత్వం కోరింది. జలాశయంలో కనీస నీటి మట్టానికన్నా దిగువకు(885 అడుగులు) నీటి నిల్వలు పడిపోయాయని, బుధవారంనాటి రీడింగ్‌ ప్రకారం 856 అడుగులుగా నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శ్రీశైలం కుడికాలువ (ఎస్‌ఆర్‌బిసి) కింద సాగయ్యే ఆయకట్టు, అలాగే రాయలసీమ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు, కెసి కాలువ ఆయకట్టు, చెన్నై వాసుల తాగునీటి అవసరాలకు సమస్యగా మారుతుంది.  సోమ, మంగళ వారాల్లో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందని, బుధవారం నాడు మాత్రము 4 యూనిట్ల ద్వారా 150 మెగావాట్ల చొప్పున మొత్తం 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని శ్రీశైలం ప్రాజెక్టులో ఎపి జెన్‌కో అధికారులు తెలిపారు. 1,2,3,4 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నట్టు వారు వెల్లడించారు. కాగా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే రెండు రాష్ట్రాల సమావేశంలో ఈ విషయం లేవనెత్తుతామని నీటిపారుదల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. బోర్డు చేసిన నిర్ణయాలను అమలు చేయలేని దుస్థితిపై హోం శాఖ కార్యదర్శి ముందు ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అధికారాలు లేని బోర్డు ఏర్పాటు చేసినా ఏమీ ఉపయోగం లేదని ఆ అధికారి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: