ఏపీతో పోటీపడి లక్షకోట్లకుపైగా బడ్జెట్ రూపొందించిన తెలంగాణ సర్కారు ఇప్పుడు వాటికి నిధులు సమకూర్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అర్జంటుగా కాసుల వర్షం కురిపించే అవకాశాలపై దృష్టిపెట్టింది. కోట్ల రూపాయల విలువ చేసే హైదరాబాద్ భూములపై సర్కారు కన్నుపడింది. ఇప్పటికే అన్యాక్రాంతమైన, కబ్జాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అమ్మేస్తే వేల కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే జారీ అయిన జీవో 166ను అస్త్రంగా వాడుకోవాలని నిశ్చయించింది.                                 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెగ్యులరైజేషన్ కోసం జారీచేసిన జీవో 166 సమీక్షించి పక్కాగా అమలు చేస్తే పది వేల కోట్ల రూపాయలు సులభంగా సమకూరుతాయని తెలంగాణ ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 2వేల ఎకరాల భూమి కబ్జాల్లో ఉందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల స్థలాలు కబ్జాల్లో ఉన్నాయని రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం తెలుపుతోంది. వీటిలో ఇప్పటికే నిర్మాణాలు ఉంటే భారీగా ఫీజు వసూలు చేసి.. క్రమబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.                       ఈ జీవో నెం 166 ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడే విడుదలైంది. అధికారిక లెక్కల ప్రకారమే.. తమ ఆధీనంలో ఉన్న స్థలాలను క్రమబద్దీకరించాలని దాదాపు 30 వేల మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. అనేక కారణాలతో వీటి రెగ్యులరైజేషన్‌ను అప్పట్లో అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు ఆ ఫైళ్లన్నీ దుమ్ముదులిపి.. క్రమబద్దీకరణకు పచ్చజెండా ఊపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మరి అదే నిజమైతే.. తెలంగాణ భూములను కాపాడతామన్న గులాబీనేతలు మాటలు నీటి మూటలే అవుతాయేమో.. డబ్బు కోసం భూములు అమ్ముకోవాలని చూస్తే.. ఆంధ్రాపాలకులకు.. తెలంగాణ పాలకులకు తేడా ఏముంటుందో..? ఏలేవారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: