తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి ఆరునెలలు అవుతోంది. రెండు రాష్ర్టాలకు కొత్త ముఖ్యమంత్రులు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ విజయఢంకా మోగించి పాలన పగ్గాలు చేపడితే..., తెలుగు ఆత్మగౌరవం, రాష్ర్ట పునర్నిర్మాణం నినాదంతో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూర్చుంది. ఇలా తెలంగాణకు చంద్రశేఖర్ రావు, ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పేరులో చంద్రుడిని పెట్టుకున్న ఇద్దరు నేతలు తమ రాష్ర్టాల్లో వెలుగులు నింపుతామని హామి ఇచ్చారు. కాని ఆరు నెలలవుతున్నా చీకట్లు మాత్రం తొలగటం లేదు. విభజన తర్వాత ఏపీ కంటే తెలంగాణలో ముందుగా ప్రభుత్వం ఏర్పడి పాలన మొదలయింది. అయితే అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేకత, సొంత అస్తిత్వం, గుర్తింపు కోసం ప్రాకులాడుతూ లేనిపోని వ్యయ ప్రయాసలు పడుతోంది. మిగులు బడ్జెట్ ను సద్వినియోగం చేసుకోకుండా అత్యవసర ఖర్చులకు వినియోగించకుండా..., అంతగా అవసరం లేని చోట్ల కోట్లు కుమ్మరిస్తోంది. రుణమాఫీ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. కొన్ని చిన్న పధకాలు ప్రవేశపెట్టారు. కాని ఎన్నికల హామిలో ప్రధానమైన ఇండ్ల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి విషయాలను మాత్రం ఇంతవరకు అమలు చేయటం లేదు. ఉద్యొగాల కోసం విద్యార్థి లోకం ఆందోళన బాట పట్టినా పట్టించుకోవట లేదు అనే విమర్శలు వస్తున్నాయి. దేశంలోనే కొత్త పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతులు అని ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్ని కంపనీలు వచ్చాయి. అసలు సింగిల్ విండో పనిచేస్తుందా.., అనేది ఎవరికి తెలియటం లేదు. ఇక విభజన కేటాయింపులు, పరిష్కారం కాని సమస్యలపై వివాదాలే తప్ప సామరస్య పూర్వక సంబంధాలు నెరపటం లేదు అనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. అందుకే ఒకప్పుడు పగ్గాలు అప్పగించిన ప్రజలే.. ఇప్పుడు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తెలంగాణ వచ్చినా తమ బ్రతుకులు మాత్రం మారలేదు అని ఆవేదన చెందుతున్నారు. ఇక విభజన తర్వాత లోటు బడ్జెట్ లో మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.., రాష్ర్ట పునర్నిర్మాణం కోసం పలు ప్రణాళికలు రచించారు. అయితే వీటిలో చాలావరకు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయం తీసుకుంటే.., విజయవాడ దగ్గర్లో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా విన్పించుకోకుండా అక్కడే నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం భూములు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. భూ లభ్యత సమస్యతో పాటు, ఎక్కువ ఖర్చు అవుతున్నప్పటికీ విజయవాడను మాత్రం బాబు వదలటం లేదు. ఇక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఆశించిన స్థాయిలో పూర్తి చేయలేదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పన ఊసేలేదు. రాజధాని, విభజన కేటాయింపులు, రాజకీయాలు తప్ప కొత్త ప్రభుత్వం వచ్చి పెద్దగా చేసిందేమి లేదు అని ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. స్వరాష్ర్ట కల సాకారం చేయాలని ఒక రాష్ర్ట ప్రజలు పగ్గాలు అప్పగిస్తే.., అనాధగా మిగిలిన తమను ఆదుకోవాలని మరొక రాష్ర్ట ప్రజలు ఆశతో అధికారం అందించారు. ఈ విషయం ఇద్దరు నేతలకు చాలాబాగా గుర్తున్నా వారు ఆచరణలో మాత్రం చూపించలేకపోతున్నారు. ఇందుకు అనేక సమస్యలు, పాలనాపర ఇబ్బందులు ఉండవచ్చు. అయితే వీటిని ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోతుంది తప్ప.., పట్టు, బెట్టు చేస్తే చివరకు రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు నష్టపోతారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీల పరిస్థితి ఏమిటో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే అర్ధం అవుతుంది. కాబట్టి.., ప్రజలకు అనుగుణంగా వారు కోరుకున్న పాలన అందిస్తే మనగలుగుతారు లేకపోతే ప్రభుత్వానికి, రాష్ర్టానికి భవిష్యత్తు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: