ప్రతి పరిణామానికి రెండు కోణాలుంటాయి. ఎంత చెడు జరుగుతుందని అనుకున్నా.. అందులోనూ ఏదో ఒక మంచి ఉంటూనే ఉంటుంది. ఏపీ విభజన విషయంలోనూ అదే జరుగుతోంది. విభజనకు ముందు రాష్ట్రం విడిపోతే ఎన్నో విధాల నష్టపోతామని ఆంధ్రాప్రజలు భావించారు. ఆ నష్టాల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి ఏపీలో రియల్ ఎస్టేట్ భూమ్ మాత్రం వారి భూములకు మంచి విలువ చేకూర్చింది. గతంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన రియల్ భూమ్ ఇప్పుడు క్రమంగా ఆంధ్రా ప్రాంతాలకు వ్యాపించింది.                                       ఏపీలో.. ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. రియల్ భూమ్ తో రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రెండింతలైందంటే రియల్ భూమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని ప్రకటనకు తోడు.. 13 జిల్లాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, కొత్తప్రాజెక్టులు వస్తాయన్న ప్రకటనలతో భూముల ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖకు 800 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే.. ఈ ఏడాది అది 1600 కోట్లకు చేరుకుంటోంది.                                           ఏపీ అంతటా భూముల ధరల పెరుగుదల కనిపిస్తున్నా.. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. గుంటూరు జిల్లాలోని 32 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, కృష్ణా జిల్లాలోని 28 రిజిస్ట్ర్రేషన్ కార్యాలయాలు బిజిబిజీగా కనిపిస్తున్నాయి. కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ వరకూ కృష్ణా జిల్లాలో 284 కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తే.. గుంటూరు జిల్లాలో 224 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ రెండు జిల్లాల తర్వాత.. తూర్పుగోదావరి,విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఆదాయం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆదాయం అతి తక్కువగా ఉంది. రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ఆపేయకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ జోరు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: