ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల్లోనూ నేతలు నిరుద్యోగులపై హామీల వర్షం కురిపించారు.. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అంటే.. కేసీఆర్ లక్ష ఉద్యోగులు అంటూ ఊరించారు. తీరా ఎన్నికలై.. ఆరు నెలలు కావస్తున్నా.. రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో నిరుద్యోగులు నేతలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఏపీలో చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ ఇదిగో..అదిగో అంటూ నాలుగు నెలలుగా ఊరిస్తూ.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 9 వేల పైచిలుకు ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.                                                    లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలిస్తూ.. 9061 పోస్టులకు నోటిఫికేషన్ వస్తోంది. ఇందులో SGT పోస్టులు 6244, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1849గా ఉన్నాయి. డీఎస్సీని ఇకపై టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్- టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ గా పిలుస్తారట. వాస్తవానికి ఇంకో 1500 పోస్టులు వస్తాయని అనుకున్నా.. సర్కారు 9వేల పోస్టులకే పరిమితం చేసింది. ఎస్టీటీ పోస్టులకు బీఈడీవారిని అనుమతించేందుకు కేంద్రం ఒప్పుకోదని తెలిసినా.. ఆ ప్రయత్నాల పేరిట సర్కారు కొన్నాళ్లు కాలయాపన చేసిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోనీ ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇచ్చారని మరోవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.                                                  ఆలస్యంగానైనా బాబు నోటిఫికేషన్ ఇస్తే.. కేసీఆర్ మాత్రం ఇప్పట్లో నిరుద్యోగులను కనికరించేలా కనిపించడం లేదు. ఇదిగో ఇంకేముంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించేస్తున్నామని ఆర్బాటంగా ప్రకటన చేసినా..ఇంతవరకూ అది పూర్తిస్తాయిలో కొలువు తీరలేదు. అధికారుల కొరత సాకుతో కేసీఆర్ కాలం గడిపేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల క్రమబద్దీకరణ పేరుతో.. కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గించేస్తున్నారని ఓయూ విద్యార్థులే ఆందోళనకు దిగే పరిస్థితి నెలకొంది. పోలీస్ శాఖలో మాత్రం 7 వేల వరకూ పోస్టులు భర్తీ చేస్తారని వార్తలు వస్తున్నా.. నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. మరి కేసీఆర్ కరుణ ఎప్పుడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: