తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిబద్ధత కలిగిన వారని, పార్టీ నాయకులు స్వార్థంతో వేరే పార్టీల్లోకి వెళ్తున్నా.. కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకుని అండగా ఉంటున్నారని చంద్రబాబు అభినందించారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బాబు ప్రసంగించారు. దేశంలో టీడీపీ నిబద్ధతకలిగిన పార్టీ అని చెప్పుకున్నారు. పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో బలమైన కార్యకర్తలున్నారని పేర్కొన్నారు. ఈ నెల 14 నుండి 16కు సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. వచ్చే యేడాది మే నెల నాటికి టీడీపీని జాతీయ పార్టీగా విస్తరిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాలనను సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని బాబు తెలిపారు. తాము ఇచ్చిన హామీలకు అమలు జరుగుతున్న విధానికి ఏమైనా లోపాలుంటే సరిచేసుకోకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పింఛన్ పెంచడంతో వృద్ధులు, వికలాంగులకు, వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. ఇప్పుడు అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆన్ లైన్ లో పింఛన్ల పంపిణీ వివరాలు పొందుపరుస్తామన్నారు. అయితే ప్రజలకు సమర్థవంతంగా పింఛన్లు అందించేందుకు కార్యకర్తలు, నేతలు తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు టిడిపి సీనియర్ నేతలు యనమల, నందమూరి హరికృష్ణ, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. తొలుత హుదుద్ తుపాన్ బాధితులకు సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: