ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణలపై ప్రతిపక్షాలు వివాదం చేస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వంలో ముసలం మొదలైంది. తమ విలువైన భూములను ప్రభుత్వం లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ట్లు రైతులు భూములు ఇచ్చేందుకు తమ వ్యతిరేకత తెలుపుతున్న నేపథ్యంలో ఓ సీనియర్‌ మంత్రి వారికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం మరింత వివాదాస్పందమైంది. రైతులు సంతృప్తి చెందకుండా భూ సమీకరణ చేయడం సరైన విధానం కాదని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సారవంతమైన భూములను తీసుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన చేసిన వ్యాఖ్య ప్రభుత్వానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండగా కేఈ చేసిన వ్యాఖ్యలు భూ సమీకరణకు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీకి సానుభూతిపరులైన రైతాంగం భూములి చ్చేం దుకు ముందుకొస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. కేఈ వ్యాఖ్యలు ఇప్పుడు భూ సమీకరణ ను వ్యతిరేకిస్తున్న పార్టీలకు ఆయుధంగా దొరికింది. ఇదిలా ఉండగా, రాజధాని కమిటీలోగానీ, భూ సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా లేనందునే అసంతృప్తితో కేఈ ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేయగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తు న్నాయి. రైతులు సంతృప్తి చెందకుండా రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ చేపట్టవద్దని కృష్ణమూర్తి తెలిపారు. రాజధాని ఏర్పాటు ఆవశ్యకతను రైతులను వివరించి, వారి ఆమోదంతోనే భూసేకరణ చేపట్టాలని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలో సభ్యుడు ఉండేందుకు తనకు ఇష్టం లేదని చెప్పారు. రాయలసీమ ప్రజల మనోభావాలను వ్యతిరేకంగా రాజధానిని ఏర్పాటు చేస్తున్నందున తాను కేబినెబ్‌ సబ్‌ కమిటీలో సభ్యుడిగా ఉండలేనని సీఎం చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.  ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని, ప్రభుత్వం రాయలసీమ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేస్తే విజయవాడ-గుంటూరు ప్రాంతాలలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. రాజధాని భూ సేకరణలో యజమానులందరికీ ఒకే రకమైన నష్టపరిహారం చెల్లించకుండా వ్యవసాయ భూమికి, మిగతా భూమికి వేర్వేరుగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటుకు భూ సమీకరణ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం నిర్వహించిన తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌పై కేఈ కృష్ణమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: