రాష్ట్రంలో ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతామని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పను నిజాయితీగా వ్యవహరిస్తానంటూ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఒంగోలులోని బచ్చల బాలయ్య, సంజీవమ్మ ఫంక్షన్ హాలులో సోమవారం కందుకూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలతో జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో బాబువస్తే జాబువస్తుందని ప్రచారం చేశారని కాని, అధికారంలోకి వచ్చిన తరువాత జాబులు పోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ప్రచారం చేసారని కాని ప్రస్తుతం అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచిపనులు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని అందువలన ప్రజలు ఆయన్ని దేవునిలా ఆరాధిస్తున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 43లక్షల 13వేల పెన్షన్లు ఉంటే వాటిలో తెలుగుదేశం ప్రభుత్వం కోతపెట్టారని ధ్వజమెత్తారు. పార్టీకి ఓటువేసిన ప్రజలందరికి అండగా ఉంటానని భరోసాఇచ్చారు. చంద్రబాబుకు లేనిది తమకు ఉన్నది దేవుడి దయ అని జగన్ అన్నారు. చంద్రబాబు అన్యాయాలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బాబు అబద్దాలను కొన్ని మీడియా సంస్ధలు మోసాయని ఆయన ధ్వజమెత్తారు. గ్రామస్ధాయినుండి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు. అధికారపార్టీపై సంవత్సరానికి కాని వ్యతిరేకత రాదని కాని జిల్లాలో మాత్రం నాలుగునెలలు తిరగకుండానే వ్యతిరేకత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలను చేయాలని ,అర్హులైన వారందరికి పెన్షన్లను మంజూరు చేయాలని కోరుతూ వచ్చేనెల 5న జిల్లాకలెక్టరేట్‌ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు జగన్ వెల్లడించారు. ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, రాష్టప్రార్టీ కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలం సురేష్, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: