ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రోజుకో రకం వార్తలు వినిపిస్తున్నాయి. భూసమీకరణ, రియల్ ఎస్టేట్ భూమ్ ల గురించి ఊహాగానాలకు కొదువలేదు. వీటికితోడు.. ఏపీ రాజధాని ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. తాజాగా ఏపీ రాజధాని గురించి తెలుగు దేశం వర్గాలు చెబుతున్న కబుర్లు వింటుంటే.. కళ్లముందే సర్వహంగుల రాజధాని కదలాడుతోంది.                     లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఏపీ కొత్త రాజధాని సచివాలయం.. 44 అంతస్తులతో నిర్మిస్తారట. కర్ణాటకలోని బృందావన్ గార్డెన్ కంటే సుందరమైన ఉద్యానవనాన్ని కృష్ణా పొడవునా నిర్మిస్తారట. దాదాపు 20 కిలోమీటర్ల పొడువు ఉంటుందట. దీని పక్కనే భారీ రహదారి, భవనాలు నిర్మించాలని స్కెచ్ గీస్తున్నారు. ఇక దీనికితోడు.. ఏపీ అసెంబ్లీని కళ్లు చెదిరేలా నిర్మిస్తారట. తాజ్ మహల్ ను తలపించే రీతిలో.. గ్రానైట్ మార్బుల్ తో దీన్ని నిర్మిస్తారట.                    ఈ రెండింటితో పాటు సీఎం అధికార నివాసాన్ని కూడా భారీగా రూపొందిస్తారట. కాకపోతే.. సీఎం నివాసం మాత్రం కృష్ణానదికి అవతల.. విజయవాడ పరిసరాల్లో నిర్మిస్తారట. ఈ రాజధాని నిర్మాణ బాధ్యతను చంద్రబాబు సింగపూర్ భుజస్కందాలపై పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు చేసేందుకు సింగపూర్ సర్కారు కూడా ఓకే చెప్పినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని భూసమీకరణ వ్యవహారం త్వరలో పూర్తి చేసి.. వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 22 నాటికల్లా రాజధానికి శంకుస్థాపన చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. బాబు క్యాపిటల్ డ్రీమ్స్ బాగానే ఉన్నాయి. అవి ఎంతవరకూ వాస్తవరూపం దాలుస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: