దేశంలో పార్టీని పట్టిష్టం చేసే పనిలో పడింది బీజేపీ. ఇందులో భాగంగానే స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆయా వర్గాలను ఆకర్షించాలని ఆలోచిస్తోంది. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోడానికి అక్కడి బిజేపీ నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి పక్కకు తప్పుకుని ఎటూ చేరకుండా ఉన్న బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తన దగ్గరకు చేర్చుకోవాలని తెలంగాణ బిజేపీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్-కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు రాష్ట్ర బిజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఒకప్పుడు అధికార కేంద్రంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం విభజన అనంతరం ప్రభావాన్ని కోల్పోయింది. వారికి అండగా ఉన్న కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కాస్తంత దూరం జరిగినట్లే కనిపిస్తోంది. వీరి మధ్య పెరిగిన అంతరాన్ని అనుకూలంగా మలచుకోవాలన్న బిజేపీ ఆలోచన. రెడ్డి వర్గాన్ని చేర్చుకుంటే మిషన్ 2019 సులువుగా చేరుకోవని తెలంగాణ బిజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికల్లో ఆ ప్లాన్-ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఓ మోస్తరు నాయకులను పార్టీలో నెమ్మదిగా చేర్చుకుంటూ పోతున్నారు. కొద్ది రోజుల కింద నల్గొండ జిల్లా, నిన్న మొన్న మహబూబ్-నగర్-లో పార్టీలో చేరిన వారిని చూస్తే బిజేపీ ప్రణాళిక అర్ధమవుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మెంబర్-షిప్ డ్రైవ్-లో పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తోందని ఫలితం తప్పకుండా కనిపిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర బిజేపీ నాయకత్వాన్ని కూడా మార్పు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ కేంద్ర మంత్రి వర్గంలో చేరడంతో బిజేపీ కేంద్ర నాయకత్వంలో ఏర్పడిన ఖాళీని తెలంగాణ బిజేపీ అధ్యక్షుడు కిషన్-రెడ్డి ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే నేతను ఎంచుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పేర్లను రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడిగా పరిశీలిస్తున్నారు. అయితే ఇంద్రసేనారెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని తెలిసింది. అయితే బిజేపీ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మధ్యశ్రేణి నాయకులు మాత్రమే పార్టీలోకి చేరుతున్నారు. ప్రభావం చూపించగలిగిన నాయకులు కమలం వైపు దృష్టి సారించడం లేదు. భవిష్యత్-లో మాత్రం ఆ కొరత తీరుతుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది తెలంగాణ బిజేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: