నవ్యాంధ్ర నూతన రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు ప్రాంతం రోజురోజుకూ కొత్త రూపును సంతరించుకుంటోంది. రాజధాని ప్రకటనకు ముందు కేవలం 15నుంచి 20లక్షల రూపాయల లోపు ఉన్న ఎకరా భూమి ధర, ప్రస్తుతం కోటి 60 లక్షల రూపాయల వరకు పలుకుతుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకటి లేదా రెండు ఎకరాలు ఉన్న రైతులు తమ భూమిని అమ్మాలా, వద్దా అని ఆలోచిస్తుండగా, అయిదు ఎకరాలు లేదా ఆపైన భూమిగల రైతులు తమ భూమిలో కొంతభాగాన్ని అమ్ముకొని దర్జాగా జీవనం సాగించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తుళ్లూరు, పరిసర గ్రామాల్లోకి పెద్దమొత్తంలో డబ్బు వచ్చి పడుతుండటంతో ఇక్కడ జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం తుళ్లూరు సెంటర్‌లో టీ పది రూపాయలు పలుకుతోంది. రాజధాని ప్రకటనకు ముందు కేవలం నాలుగు లేదా 5 రూపాయలకు ఇక్కడ టీ దొరికేది. అదేవిధంగా రెండు ఇడ్లీ లేదా దోసె ధర గతంలో 10 రూపాయలు లోపు ఉండగా, ప్రస్తుతం 20 రూపాయలు. గతంలో తుళ్లూరులో ఉన్న ఒకటి, రెండు కాకా హోటళ్లలో భోజనం కేవలం 50 రూపాయలు ఉండేది. ప్రస్తుతం ఈ హోటళ్ల సంఖ్య 10 వరకు చేరుకోగా, భోజనం ధర ఒకేసారి వంద రూపాయలకు పెంచేశారు.  విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో భోజనం ఇదే రేటు ఉండటం గమనార్హం. అంతకుముందు విలాసవంతమైన కారు ఊర్లోకి వస్తే విచిత్రంగా చూసే గ్రామస్థులు ప్రస్తుతం అటువంటి వాటినే తామే సొంతం చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. దీనిని గమనించిన ప్రముఖ టాటా, రేనాల్, టయోటా వంటి కంపెనీలు తుళ్లూరులో తాత్కాలిక స్టాళ్లను ఏర్పాటుచేసి తమ వాహనాల గురించి తెలియజేస్తున్నాయి. వీటికితోడు ప్రధాన మోటారు బైక్‌ల కంపెనీలు కూడా ఇక్కడ ప్రదర్శన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇదిలావుండగా తుళ్లూరు ప్రాంతంలో పెద్దమొత్తంలో నగదు చేరుతోందన్న సమాచారంతో ప్రముఖ బ్యాంకులు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఆంధ్రాబ్యాంకు తుళ్లూరు మండలంలో కొత్తగా మూడు శాఖలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే వసతి సౌకర్యాలు మాత్రం తుళ్లూరులో అందుబాటులో ఉండటంలేదు. ఇప్పటికిప్పుడు నిర్మించడం సాధ్యం కాదు కనుక ఆవైపుగా ఎవరూ దృష్టిసారించడం లేదు. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సమీపంలోని గుంటూరు లేదా విజయవాడకు వెళ్లి బస చేస్తున్నారు. రియల్టర్లు మాత్రం ప్రధాన రహదారిలో చిన్న రూమ్‌లను అద్దెకు తీసుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తుళ్లూరు, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో స్థలాల ధరలు కూడా ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాలతో సమానంగా ఇక్కడ గజం 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో కేవలం భూములు మాత్రమే తీసుకుంటామని, గ్రామాల జోలికి రాబోమని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ మండలంలోని గ్రామాల్లో ముందుచూపుగా కొందరు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తుళ్లూరు, పరిసరాల్లో స్థలాలకు మంచి గిరాకీ ఏర్పడింది. మొత్తమీద రాజధాని పుణ్యమా తుళ్లూరు రూపురేఖలే మారిపోతున్నాయి. చిత్రం.. రద్దీగా మారిన తుళ్లూరు ప్రధాన రహదారి

మరింత సమాచారం తెలుసుకోండి: