ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు ఏడుకొండవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శించుకునేందుకు బారులు తీరతారు. ఒక్క క్షణం దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో వీఐపీల పేరుతో భక్తులకు ఇప్పటికే అనేక కష్ఠాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలు మొదలుకొని మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ సిఫారసు లేఖలు పంపుతూ సామాన్యులకు సౌకర్యాలు అందకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది.                                                కొత్త ప్రభుత్వం రాకతో.. తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఒనగూరుతాయని ఆశిస్తుంటే.. కొందరు మంత్రుల తీరు అందుకు అడ్డుగా నిలుస్తోంది. ప్రత్యేకించి ఏపీ డిఫ్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి.. తన సొంత మనిషిని తన తరపున ఏజెంటుగా నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నందకుమార్ అనే వ్యక్తిని తన అధీకృత మనిషిగా నియమించాలని ఆయన రెవెన్యూ మంత్రి హోదాలో తిరుమల అధికారులకు రాసిన లేఖ మీడియాకు చిక్కడం ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీసింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రే ఇలా లేఖరాయడంతో.. ఏజెంటుగా ఎలా నియమించాలి.. అందుకు నిబంధనలు ఎలా సహకరిస్తాయన్న ఆందోళన తిరుమల అధికారుల్లో కనిపిస్తోందట.                                              కేవలం లేఖ రాసి ఊరుకోవడమే కాకుండా.. ఆ నియామకం ఎక్కడిదాకా వచ్చిందని ఉప ముఖ్యమంత్రి తిరుమల అధికారులను ఫాలో అప్ చేశారట. ఇప్పటికే తిరుమలలో సిఫార్సుల రాజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ లేఖ బయటకురావడం కలకలం సృష్టిస్తోంది. ఈ లేఖ వాస్తవమేనా.. అదే నిజమైతే.. అలా ఏజెంటును నియమించుకునే అవకాశం ఉందా.. ఉంటే కేవలం ఉపముఖ్యమంత్రికే ఉందా.. లేక మిగిలిన మంత్రులకూ ఆ అవకాశం ఉందా.. అనే వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి ఈ వివాదంతో మరింత చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: