అన్నదాత కష్టం ఇంకా తీరలేదు. రుణ మాఫీ హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్.. ఆ దిశగా చేపట్టిన చర్యలు ఇంకా ఫలించలేదు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితా.. గందరగోళంగా ఉంది. బ్యాంకులకు చేరిన రుణమాఫీ అర్హుల జాబితాలో చాలా పేర్లు గల్లంతయ్యాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా... ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెల్లడించిన తొలి జాబితాలో కొన్ని పేర్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పేరు ఎందుకు లేదంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ కూడా సరైన సమాధానం వారికి అందడం లేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఇప్పుడే ఏం చేయాలో తెలియక రైతు ఆవేదన చెందుతున్నాడు. అయితే బ్యాంకు అధికారుల సమాధానం మరోలా ఉంది. తొలి అర్హుల రుణమాపీ జాబితాలో పేర్లు లేనంత మాత్రాన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ ఉన్నత అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ పథకం నుంచి పేరు తొలగింపు ప్రసక్తే ఉండదనీ... అందరికీ ప్రయోజనం వర్తింప చేస్తామంటున్నారు. అంతేకాదు పేర్లు నమోదు చేయడంలో బ్యాంకులు చేసిన పొరపాటు వల్లే ఈ తికమక జరిగిందని చెప్పుకొస్తున్నారు. మరో విషయం ఏంటంటే... కొన్ని బ్యాంకుల్లో ఆధార్ నెంబర్ ను కాపీ చేయడంతో అందరికీ ఒకే ఆధార్ నెంబర్ నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. అంతమాత్రాన మాఫీ వర్తింపు కాదని భావించవద్దని రైతులకు చెబుతున్నారు. ఇక కొందరి రైతులు పేర్లు గల్లంతు అయినంత మాత్రాన మాఫీ ప్రక్రియ ఆగదంటున్న ఆర్థిక శాఖ అధికారులు.... ప్రకటించిన వారికి మాఫీ చేస్తామనీ... ఆ తర్వాత పొరపాట్లు సరిదిద్దుకుని మిగిలిన వారికి కూడా జనవరి మొదటి వారంలోగా మాఫీ చేస్తామంటున్నారు. ఏదిఏమైనా అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా సర్కార్ చర్యలు చేపట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: