పర్యావరణం జగతి రక్షణ కవచం. చుట్టుపక్కలి వాతావరణం నుంచి అనంతంగా విస్తరించిన అన్ని ఆవరణాలు పర్యవరణ పరిధిలోనివే. త్రికరణ శుద్ధిగా పరిరక్షించుకోవాల్సినవే. మన చుట్టుపక్కలి వాతావరణం కాలుష్య రహితంగా ఉంటేనే..అది విస్తరించి ప్రపంచ పర్యావరణం పరిశుద్ధ కావడానికి దోహదం చేస్తుంది. వాతావరణంలో మేట వేసిన కాలుష్య ఉద్గారాల ఫలితం అన్ని కోణాల్లోనూ ప్రస్ఫుటిస్తోంది. దీని ఫలితాలు, పర్యవసానాలు రోజువారీగా కళ్లకు కడుతున్నాయి. అనంతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రత..దాని విపరిణామంగా తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న బీభత్సం జగతిని కకావికలు చేస్తోంది. రియో డి జెనీరో నుంచి ఇప్పటి వరకూ పర్యావరణ కాలుష్యంపై ఆందోళన చెందని క్షణం లేదు. అలాగే..ఆ దిశగా తీసుకున్న నిర్దుష్ట చర్యలు ఆచరణాత్మకమైన దాఖలాలూ లేవు. వచ్చే ఏడాది పారిస్‌లో జరుగనున్న కీలక శిఖరాగ్ర సదస్సుకు నేపథ్యంగా పెరూ రాజధాని లిమాలో ఐరాస సారథ్యంలో గత పదకొండు రోజులుగా జరుగుతున్న వాతావరణ సదస్సు చరమాంకానికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకూ సాధించిందేమిటన్నది ఆసక్తిని కలిగించేదే! 190 ఐరాస సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు జరిపిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పుడమి పరిరక్షణకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయగలగాలి. అప్పుడే పారిస్‌లో ఇందుకు సంబంధించి ఏకగ్రీవ రీతిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి ఇలాంటి సదస్సులను వార్షికంగానే నిర్వహిస్తున్న ఐరాస పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతలు చిత్తశుద్ధితోనే నిర్వర్తిస్తోంది. ఎప్పటికప్పుడు కర్తవ్య బోధ చేస్తూ ప్రపంచ దేశాల తీరుతెన్నుల్నీ ఎండగడుతోంది. ఇప్పటికే వాతావరణంలోకి విసర్జించిన కాలుష్య ఉద్గారాల పరిమాణం అనంతంగానే పెరిగిపోయింది. దీని ఫలితంగా ప్రమాదకర సూర్య కిరణాలు నేరుగానే పుడమిని తాకి భూతాపాన్ని పెంచేస్తున్నాయన్నది ఎంతైనా వాస్తవం. ఇప్పటి వరకూ జరిగిన సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలను, అంగీకరించిన ఒప్పందాలను ఏ మేరకు అమలు చేయగలిగాం? ఎంత వరకూ లక్ష్యాలను సాధించుకున్నామన్న వౌలిక అంశాలపై ఈ పనె్నండు రోజుల సదస్సు దృష్టి పెట్టడం భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యల్ని నిర్దేశించేదే. కర్బన ఉద్గారాల విసర్జన విషయంలో ప్రపంచ దేశాల తీరు విడ్డూరం. ధనిక దేశాలు ఇప్పటికే గణనీయమైన ప్రగతిని సాధించాయి. పారిశ్రామికంగా అవి మరింత ఎదగాల్సిన అవసరమూ లేదు. కానీ, కాలుష్యం ఇంత తీవ్రం కావడానికీ, అన్ని విధాలుగా ప్రపంచ దేశాలను కకావికలు చేయడానికీ దారితీస్తున్న పరిస్థితులు సంపన్న దేశాల పుణ్యమేనని చెప్పక తప్పదు. లిమా సదస్సు ప్రాధాన్యత మరింతగా పెరగడానికి కారణం ఇందులో కేవలం ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులే కాకుండా పర్యావరణ పరిరక్షణోద్యమాన్ని సాగిస్తున్న వందలాది ఎన్జీవో సంస్థలూ పాల్గొనడం. ఏ విధంగానూ చర్చలు తప్పుదోవ పట్టకుండా, ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని విస్మరించకుండా ముందుకు సాగడానికి ఇందరి ప్రమేయం కచ్చితంగా దోహదం చేస్తుంది. భూతాపాన్ని 2డిగ్రీల సెల్సియస్ పరిధికి కుదించాలన్నది ఈ సదస్సును నిర్వహించడంలో ఐరాస ఉద్దేశం. భూమి ఉష్ణోగ్రత ఇంతకు మించితే తలెత్తే విపరిణామాలను తట్టుకోలేమంటూ ఇప్పటికే పర్యావరణ వేత్తలు, ఈ రంగంలో కృషి చేస్తున్న నిపుణులూ చేస్తున్న హెచ్చరికలను విస్మరించడానికి వీల్లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రత తీవ్రత ఫలితాలను అనుభవిస్తున్న నేపథ్యంలో ఇది రెండు డిగ్రీల సెల్సియస్ దాటిపోతే మాత్రం తుపానులు, ఉప్పెనలు, కరవుకాటకాలు.. ఒకటేమిటి అనంతంగానే సమస్యల వెల్లువకు దారితీస్తుందన్నది వాస్తవం. అయినా కూడా వాతావరణ మార్పులను యుద్ధ ప్రాతిపదికన అరికట్టే విషయంలో దేశాల మధ్య ఇప్పటికీ ఎలాంటి అవగాహన లేదు. ఎప్పటికప్పుడు శిఖరాగ్ర భేటీలు జరిపి హడావుడి చేయడం మినహా సాధించిందీ ఏమీ లేదన్నది నిజం. ఈ నేపథ్యంలో ఇదే స్థాయిలో కాలుష్య ఉద్గారాల విసర్జన జరిగితే భూగోళ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఇంధనం, రవాణా, విద్యుత్ తదితర అవసరాలన్నిటికీ శిలాజ ఇంధనమే ఆధారం. దీనిపైనే ప్రపంచ దేశాలన్నీ అత్యధిక స్థాయిలో ఆధారపడ్డాయి కూడా. ఫలితంగా ఏటా 50గిగాటన్నుల మేర గ్రీన్‌హౌస్ వాయు విసర్జన జరుగుతోంది. ఉష్ణోగ్రతను 2డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్న నిబంధనను ఎవరూ ఖాతరు చేయని ఫలితంగా ఈ విషవాయు పరిమాణం ఎప్పటికప్పుడు తీవ్రమవుతూనే ఉంది. రానున్న పదిహేను సంవత్సరాల కాలంలో ఈ విషవాయు పరిమాణాన్ని 41గీగా టన్నులకు కుదించుకోక పోతే..అదే స్ధాయిలో ఈ శతాబ్దాంతానికల్లా శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోక పోతే మాత్రం మొత్తం వ్యవస్థలోనే పెను మార్పులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇటీవల చైనా, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం కొంత మేర పరిస్థితులను సానుకూలంగా మార్చింది. అయినా కూడా భూగోళ ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని దేశాలూ ఇదే తరహా చిత్తశుద్ధిని కనబరచాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇచ్చిన హామీలను,చేసిన వాగ్దానానలు అమలు చేయాల్సి ఉంటుంది. 2050కల్లా కాలుష్య ఉద్గారాల విసర్జనను 80శాతం మేర తగ్గించుకుంటామని ముందుకొచ్చిన కొన్ని దేశాల్లో బ్రిటన్ ఒకటి. అనేక అభివృద్ధి చెందిన దేశాలూ ఈ మేరకు హామీ ఇచ్చినా భూతాప తీవ్రతను తగ్గించేందుకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలేమిటో స్పష్టం కావడం లేదు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే సామాజికంగానూ,వ్యవస్థాగతంగానూ పెనుమార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక వర్థమాన, పేద దేశాలకు ఈ పరిస్థితి ఆర్థికంగా అత్యంత వ్యయభరితం అవుతుంది. కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో దేశాల మధ్య సరైన అవగాహన ఏర్పడక పోవడానికి ప్రధాన కారణం..ఇందులో నిష్పాక్షికత లోపించడం. తమ వంతు అభివృద్ధిని సాధించిన ధనిక దేశాలు భారత్ తదితర దేశాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించడం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ఏ దేశం తప్పు చేసినా..దాని ఫలితాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అనుభవించాల్సిందే. ఇప్పటి వరకూ విసర్జితమైన కాలుష్య ఉద్గారాల పరిమాణంలో పెద్దవాటా సంపన్న దేశాలదే. ఈ లక్ష్య సాధనలో పెరూ పర్యావరణ సదస్సు మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ప్యారిస్‌లో జరుగనున్న సదస్సు అర్థవంతం కావాలంటే అందుకు ఐరాస నిర్వహించిన తాజా సదస్సు అర్ధవంతం కావాలి. 2009 కోపెన్‌హగన్ శిఖరాగ్ర భేటీలా పారిస్ సదస్సు నీరు గారిపోకూడదు. అందుకు లిమా భేటీ ఊతాన్నివ్వాలి. అన్ని దేశాలనూ ఒప్పింది ప్రపంచ మనుగడకు బలమైన బాట వేయాలి. కాలుష్యంతో జగతికే ముప్పు అన్న స్పృహను ప్రతి ఒక్కరిలో కలిగించితేనే..పుడమి పచ్చదనంతో పరవళ్లు తొక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: