ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం ఏమైందని కాంగ్రెస్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నాయకుడైన సి. రామచంద్రయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయడును ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గత యుపిఎ ప్రభుత్వం ఆదరాబాదరగా చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై రామచంద్రయ్య సోమవారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, పార్టీ నాయకుడు గౌతం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం గురించి వెంకయ్యనాయుడు మాట్లాడితే బాగుండేదని అన్నారు. ఆ అంశం మాట్లాడకుండా గత యుపిఎ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తప్పులు చేసిందని విమర్శించారని ఆయన తెలిపారు. చట్టంలో లోపాలు ఉండవచ్చు, అధికారంలో ఉన్నారు సవరించండి అని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వచిన తర్వాత ధరలు తగ్గాయని వెంకయ్య నాయుడు గొప్పలు చెప్పారని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గితే, దాని ఫలితంగా డీజిలు, పెట్రోలు ధరలు తగ్గాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వం గొప్పతనం ఏముందని ఆయన ప్రశ్నించారు. పైగా ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయంటూ విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల్లో ఏ ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. ఈ ఆరు నెలల్లో వాగ్దానాలు కురిపిస్తూ, అధికారుల బృందాలతో విదేశీ పర్యటనలు చేయడం మినహా ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అన్నింటికీ జిందాతిలిస్మాత్ మందులా ఎంత సేపూ ఎపికి రాజధాని అంశం తప్ప మరో అంశం గురించి మాట్లాడడం లేదని అన్నారు. నేడు సమావేశం ఇలాఉండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు, వైఫల్యాలపై మంగళవారం ఉదయం 11 గంటలకు నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ జర్నలిస్టులను కూడా ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: