రామ మందిరం.. హిందుత్వ వాదుల తీరని కల.. హిందువులకు పరమ పూజ్యుడైన శ్రీరాముడు జన్మించిన భూమిగా పేరొందిన అయోధ్యలో.. రామ మందిరం నిర్మించాలని బీజేపీ కూడా కోరుకుంటోంది. కోరుకోవడమే కాదు.. కొన్నేళ్ల క్రితం అదే ఎజెండాతో ఎన్నికలకు కూడా వెళ్లింది. ప్రధానిగా పీవీ ఉన్న సమయంలో అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కూలగొట్టింది కూడా బీజేపీ, వీహెచ్ పీల పిలుపు మేరకే. ఐతే ఇన్నాళ్లూ అధికారం చేతిలో లేకపోవడం వల్ల ఆ కల కలగానే ఉండిపోయింది.                                మరి ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. మరి ఈ సమయంలో తమ చిరకాల వాంఛ నెరవేర్చుకుంటుందా.. మళ్లీ రామ మందిరమనే తేనెతుట్టెను కదుపుతుందా.. లేటెస్టుగా పార్లమెంటులో జరిగన చర్చ ఈ ఆసక్తికర ప్రశ్నలకు తెర తీస్తోంది. మోడీ హయాంలో అయోధ్యలో రామ మందిరం కట్టి తీరాల్సిందేనని సోమవారం లోక్ సభలో శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే డిమాండ్ చేయడం కలకలం సృష్టించింది. వాజ్ పేయి ప్రభుత్వం రామమందిరం కడతామని ప్రజలకు హామీ ఇచ్చిందని.. చంద్రకాంత్ ఖైరే డిమాండ్ చేశారు.                వాజ్ పేయి ప్రభుత్వం ఇచ్చిన హామీని మోడీ పూర్తి చేయాలని ఖైరే లోక్ సభలో చెప్పిన సమయంలో.. బీజేపీ, శివసేన సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. రామ మందిరం విషయం ఇప్పటికీ కోర్టుల్లోనే ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ గుర్తు చేశారు. ఐతే ఈ విషయంపై కోర్టుల్లో ఏళ్లతరబడి కేసు కొనసాగిస్తున్న హషిం అన్సారీ కూడా అక్కడ రామమందిరం కట్టించాలనే కోరుకుంటున్నారని చంద్రకాంత్ ఖైరే లోక్ సభలో చెప్పారు. ఖైరే వ్యాఖ్యలతో లోక్ సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ఖైరే వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. మరి ఈ నేపథ్యంలో రామమందిరం విషయం ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: