రాచకొండ గుట్టలు.. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గుట్టలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్టలు.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ గుట్టల్లో ఫిల్మ్ సిటీ, ఫార్మాసిటీలతో పాటు అనేక పరిశ్రమలు, క్రీడా సంస్థలు నెలకొల్పాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. సీఎం విహంగ వీక్షణం కూడా చేసి.. ఈ గుట్టలను సందర్శించడంతో వీటికి ఇప్పుడు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది.                         ఒకనాడు కాకతీయ రాజులకు సామంతులుగా ఉన్న పద్మనాయకులు ఈ రాచకొండ గుట్టలనే రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. ఇప్పటికీ రాచకొండ కోటలో ఆ ఆనవాళ్లున్నాయి. రాజధాని శివార్లకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వీటికి ప్లస్ పాయింట్. వీటి అభివృద్దిపై కేసీఆర్ చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. అదే విషయం కేసీఆర్ తో అన్నప్పుడు ఆయన చెప్పిన లాజిక్ చుట్టపక్కల వారిని ఆశ్చర్యపరిచింది.                     హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఎదురుగా ప్రస్తుతం సినీమ్యాక్స్ ఉన్న స్థలాన్ని తాను కొని ఉండాల్సిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా గుట్టలే. అక్కడకు వెళ్లాలంటేనే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇరవయ్యేళ్ల కింద కేసీఆర్ మామ స్నేహితుడు ఒకాయన ఇప్పుడు సినీమ్యాక్స్ ఉన్న స్థలాన్ని గజం రూ. 40 లెక్కన కొనుగోలు చేయాలని చెబితే... చూసేందుకు వెళ్లారట.                      కొండలు, గుట్టలుగా ఉన్న ఆ ప్రాంతానికి స్కూటర్ పై కూడా వెళ్లలేకపోయారట. ఆ భూమిని చూసి కేసీఆర్ కు చాలా కోపం వచ్చిందట. ఇలాంటి రాళ్లు, రప్పలున్న భూమి కొనమంటావా? అని కోప్పడ్డారట. ఇప్పుడు రాచకొండ గుట్టలను చూస్తే అదే గుర్తుకువస్తోందంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారట. ఏమో మరి.. రాచకొండ గుట్టలు.. ఏనాటికైనా బంజారా హిల్స్ అవుతాయా.. కాలమే సమాధానం చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: