రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌, బిజెపి మైత్రీ బంధం క్రమక్రమంగా బలపడుతోన్నట్లు కనబడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కావటం, అనంతరం వరంగల్‌ జిల్లా కొమురవెల్లికి ఇరువురూ కలిసి వెళ్లటం తదితర పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌ నగరాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ శనివారం దిల్‌ఖుషా అతిథి గృహంలో కొందరు రాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులను ఇప్పించే బాధ్యతను తాను స్వీకరిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పటం గమనార్హం. ఇది జరిగిన తెల్లారి (ఆదివారం) ఉదయమే రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దత్తాత్రేయతో భేటీ అవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కమలం, గులాబీ మధ్య చిగురిస్తోన్న ఈ సయోధ్య పైకి నిధులకోసమే అన్నట్లుగా కనబడుతున్నప్పటికీ అంతర్గతంగా ఇతరత్రా రాజకీయ కారణాలు లేకపోవన్నది విశ్లేషకుల అభిప్రాయం. కేంద్రంతో సంబంధాల విషయంలో గతంలో పోలిస్తే ముఖ్యమంత్రి వైఖరిలో చాలా మార్పు వచ్చింది.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్ల విషయంలో ఎక్కడా రాజీపడబోం, పోరాడైనా వాటిని సాధించుకుంటామంటూ ఇంతకు ముందు ప్రకటించిన కెసిఆర్‌ తన రూటును కొద్దికొద్దిగా మార్చుకుంటూ వస్తున్నారు. గతంలో కేంద్రంతో సై అంటే సై అన్న కెసిఆర్‌ ఇప్పుడు ఆ వైఖరికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నూతన రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రకటించిన సిఎం, వాటిని పూర్తి చేసేందుకు కేంద్రంపై ఆధారపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని రాబట్టే పనిలో భాగంగా రాష్ట్రానికి చెందిన బిజెపి పెద్దలతో సిఎం తరచూ భేటీ అవుతున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సిహెచ్‌ విద్యాసాగరరావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున పౌర సన్మానం చేయటం దగ్గర్నుండి మొదలైన ఈ ప్రహసనం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవల ప్రధాని మోడీ, ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా...దేశానికి, రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రణాళికా సంఘం రద్దును కెసిఆర్‌ ఆహ్వానించటమే గాకుండా, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా బాగున్నాయంటూ కితాబిచ్చారు. టిఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు కేంద్రం ప్రభుత్వం తెలంగాణ సర్కారుపట్ల మంచి భావనతో ఉందంటూ తరచూ ప్రకటిస్తున్నారు. గ్రాంట్లు, నిధులు రాబట్టేందుకు వీలుగా బిజెపితో మైత్రీబంధాన్ని పటిష్టం చేసుకునేందుకోసమే గులాబీ నేతలు ఈ రకంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో బిజెపి పెద్దలు సైతం టిఆర్‌ఎస్‌తో స్నేహ హస్తం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న లోపాలను సవరిస్తామంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొనగా, తెలంగాణ రాష్ట్రాభివృద్ధికోసం ఇక్కడివాడిగా కేంద్రంతో మాట్లాడతానని దత్తాత్రేయ హామీనిచ్చారు. ఈ పరిణామాలన్నీ మున్ముందు ఎలాంటి రూపాంతరం చెందుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: