చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఆసియా క్రీడలను ఘనంగా నిర్వహించారు. ఆ క్రీడల నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో హైదరాబాద్ లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించారు. గచ్చిబౌలిలోని స్టేడియం, క్రీడాగ్రామం, సరూర్ నగర్, యూసఫ్ గూడ స్టేడియాలు ఆ తర్వాత కూడా క్రీడానిలయాలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు స్టేట్ రెండు ముక్కలైంది. ఆ సౌకర్యాలు తెలంగాణకు వచ్చేశాయి. మరి ఇప్పుడు ఏపీ సంగతేంటి.. ఏపీలో ఈ సౌకర్యాలు కల్పించేదెలా..?                                           ఇందుకు జాతీయ క్రీడలను ఉపయోగించుకోవాలని టీడీపీ సర్కారు ప్లాన్ వేసింది. జాతీయ క్రీడల నిర్వహణ అవకాశం లభిస్తే.. కేంద్రం నిధులిస్తుంది. వాటిలో మౌలికసదుపాయాలు కల్పించవచ్చని ఆలోచించారు. అసలే నిధుల కొరతతో ఇబ్బందిపడుతున్నాం కాబట్టి.. వీటి ద్వారానైనా కాస్త సదుపాయాలు తెచ్చుకోవచ్చని భావించారు. మంత్రిపదవి పగ్గాలు అందుకున్న వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు ఇదే మాట చెప్పారు. 2017 వరకూ జాతీయ క్రీడల నిర్వహణ హక్కుల్ని ఇప్పటికే ఇచ్చేశారు కాబట్టి 2018 హక్కులు సాధిస్తామని గొప్పలు చెప్పారు.                         కానీ ఈ ప్లాన్ అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. 2018లో జాతీయ క్రీడల నిర్వహణకు అందివచ్చిన అవకాశాన్ని ఏపీ చేజేతులా జారవిడుకుంటే .. ఉత్తరాఖండ్ సునాయాసంగా ఎగరేసుకుపోయింది. చెన్నైలో జరిగిన భారత ఒలింపిక్ సంఘం సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. ఉత్తరాఖండ్ పక్కా ప్రణాళికతో ఈ సమావేశానికి వెళ్తే.. ఆంధ్రా నుంచి ఒక్కరంటే ఒక్కరూ వెళ్లలేదు. టోర్నీ నిర్వహణ బిడ్ దాఖలు చేసేందుకు 50 లక్షలు డీడీ చెల్లించాల్సి ఉంటుంది. అధికారుల మధ్య అవగాహన, సమన్వయలోపంతో ఆ పని చేయకపోవడంతో.. మొత్తానికి ఆఛాన్స్ ఉత్తరాఖండ్ కు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: