వణుకుపుట్టిస్తున్న చలిలోనూ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఐదురోజులపాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. కీలకమైన 5 బిల్లులు, 4 తీర్మానాలు సభ ఆమోదించింది. రైతుల రుణాల మాఫీ, రాజధాని బిల్లు వంటి కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. మొత్తం 22 గంటల 54 నిమిషాల పాటు సభ జరిగింది. కేవలం 5 రోజులు మాత్రమే సభ జరిగినా.. వైకాపా ప్రభుత్వాన్నిబాగానే నిలదీసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.                                   తొలిరోజు కాస్త జగన్ ఆవేశపడి.. గాడి తప్పినట్టు అనిపించినా.. ఆ తర్వాతి రోజుల్లో సమర్థంగా వ్యవహరించారు. రుణమాఫీ అంశంపై జగన్, రాజధాని అంశంపై ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరితో వాగ్వాదం విషయం పార్టీపై సానుభూతిని పెంచింది. పదే పదే రోజా కన్నీళ్లు పెట్టడం, ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, గోరంట్ల రెచ్చిపోయి.. రోజాకు వార్నింగ్ ఇవ్వడం వంటి అంశాలు జగన్ పార్టీకి కలసొచ్చాయని చెప్పొచ్చు.                               అంతేకాదు.. వైకాపా విమర్శలకు టీడీపీ సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయిందని.. విమర్శలను తిప్పికొట్టలేకపోయిందని టీడీపీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని దోచిపెట్టారని... జగన్ అవినీతి కేసుల్లో ఇరుక్కున్నాడన్న ఎదురుదాడి తప్పితే.. టీడీపీ నేతల దగ్గర మరో అంశంలేకపోయింది. విపక్షాన్ని ఎదుర్కునేది ఇలాగేనా అని చంద్రబాబే సొంత మంత్రులకు అక్షింతలు వేశారని సమాచారం.                         ఐతే.. వైసీపీ కూడా హుద్ హుద్ విషయంపై సర్కారుపై అనవసర విమర్శలు చేయడం నెగిటివ్ గా మారింది. ప్రతిపక్షమంటే విమర్శించడానికే ఉందనే రీతిలో వైసీపీ వ్యవహరించిందని మరోసారి నిరూపించినట్టైంది. సభాసమావేశాల పొడిగింపు కోసం వైకాపా డిమాండ్ చేయకపోవడం కూడా మరో మైనస్ పాయింట్. ఓవరాల్ గా చూస్తే.. అసెంబ్లీ సమావేశాల విషయంలో టీడీపీపై వైకాపా పైచేయి సాధించిందనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: