కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కుదేలయ్యింది. స్వయంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీలు కాశ్మీర్ లో కాలికి బలపం కట్టుకొని తిరిగినా ప్రయోజనం కనపడలేదు. అధికారంపై ఆశలేమీ లేకుండా వారు చేసిన ప్రయత్నాలకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు. మొత్తం 87 స్థానాలున్న కాశ్మీరంలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లకు పరిమితం అయ్యింది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకోవడం.. కాంగ్రెస్ కుంచించుకుపోవడం విశేషం అవుతోందిప్పుడు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయజనతా పార్టీ ధాటికి చిత్తయిన కాంగ్రెస్ కు ఇది మరో ఎదురుదెబ్బ అనుకోవాలి. అయితే ఇంత ఎదురుదెబ్బ తగిలినా.. వరసగా తుగులుతున్నా.. కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ కాలర్ ఎగరేస్తోంది. కాశ్మీర్ లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ ఆనందపడుతోంది. ఇప్పుడు ఎవరూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. అన్నా మరొకరి మద్దతు అవసరం అవుతోంది. దీంతో ఇది తమకు అనుకూలాంశం అని కాంగ్రెస్ లెక్కలేసుకొంటోంది. తాము సొంతంగా అధికారం సాధించలేకపోయినా... పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ ప్రధానప్రత్యర్థి బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ లెక్కలేసుకొంటోంది! ఈ విధంగా కిందపడినా పై చేయి తమదేనని కాంగ్రెస్ మురిసిపోతోంది. మరి కాశ్మీరంలో ఏం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: