దేశంలో చాలా ప్రాంతాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ...ఇప్పుడు జమ్మూ, కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు కట్టి అధికారంలోకి వచ్చే యత్నం చేస్తోంది.. జమ్మూ కాశ్మీర్‌లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో మతతత్వ పార్టీ బీజేపీని దూరం ఉంచండన్న నినాదంలో... అతి పెద్దపార్టీగా అవతరించిన పీపుల్స్ – డెమాక్రటిక్ పార్టీ- పీడీపీ- తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ ప్రకటించారు. ఇటీవల వరకూ నేషనల్ కాన్ఫరెన్స్ –తో అధికారం పంచుకున్న కాంగ్రెస్ – ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆ పార్టీకి దూరమైంది. ఇప్పుడు పీడీపీతో పొత్తు కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్- లో కొద్ది సంవత్సరాలుగా పొత్తులు కొనసాగుతున్నాయని అజాద్ అన్నారు. ఇప్పటికే పీడీపీ- బీజేపీ పొత్తు విషయంపై వార్తలు రావడంతో... గులాంనబీ అజాద్ ఈ ప్రకటన చేశారు. మతవాద శక్తులతో చేతులు కలపాలా వద్దా అన్న విషయాన్ని పీడీపీ యే నిర్ణయించుకోవాలని అజాద్ హెచ్చరించారు. మతతత్వ శక్తులతో కాంగ్రెస్- రాజీలేని పోరాటం సాగిస్తుందని, ఆ పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవికి రాజీనామా చేశారు. కేవలం 15 స్థానాల్లో నెగ్గిన నేషనల్ కాన్ఫరెన్స్ – ప్రతిపక్షంలో నిర్మాణాత్మక పాత్ర వహిస్తుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఎక్కువ స్థానాలు గెలుచుకున్నందువల్ల ప్రభుత్వం ఏర్పాటు బాధ్యత పీడీపీ, బీజేపీలదే అని అబ్దుల్లా తెలిపారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా పీడీపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తాము తొందరపడి నిర్ణయం తీసుకోబోమని సయీద్ కుమార్తె, పీడీపీ నేత, మహబూబా ముఫ్తీ తెలిపారు. 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. సంకీర్ణప్రభుత్వం లో చేరడమా, లేక మద్దతు నివ్వడమా అనే విషయంలో బీజేపీ ఆలోచిస్తోందని బీజేపీ ప్రెసిడెంట్ – అమిత్ షా పేర్కొన్నారు. హిందువులు అధికంగా ఉన్న జమ్మూలో దాదాపు అన్నిస్థానాలనూ గెలుచుకున్న బీజేపీ, ముస్లీంలు అధికంగా ఉన్న కాశ్మీర్ వ్యాలీలో ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. 87 స్థానాలు గల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 44 స్థానాలు కావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: