రాజధాని బిల్లు ఆంధ్రా కేబినెట్లో చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది. రాజధాని విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి రాజధాని బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించవలసింది ఈయనే. ఎందుకంటే.. భూసమీకరణ వంటి కీలకమైన అంశాలు రెవెన్యూశాఖ పరిధిలోకే వస్తాయి. కానీ రాజధాని విషయంలో చంద్రబాబు మొదటి నుంచి కేఈను దూరం పెడుతూ వస్తున్నారు. రాజధాని సలహా కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించలేదు. ఇప్పుడు బిల్లు రూపకల్పనలోనూ అంతే.                                       రాజధాని నిర్మాణం వంటి కీలకమైన విషయంలో రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకుండా జరిగిపోతుండటం కేఈ కృష్ణమూర్తిని బాధిస్తోంది. అంతేకాకుండా.. రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలన్నింటిలో నారాయణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ మాత్రం దానికి తనకు ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖలు అప్పగించడం ఎందుకని కేఈ ఆగ్రహంతో ఉన్నారు. ఆ అసంతృప్తితోనే ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో తన అక్కసు వెళ్లగక్కారని తెలుస్తోంది. రాజధాని అంశానికి తోడు.. రెవెన్యూశాఖలో బదిలీల బాగోతం కూడా కేఈ అసంతృప్తికి మరో కారణంగా కనిపిస్తోంది.                            ఐతే.. రెవెన్యూ మంత్రిగా కేఈ పనితీరు సంతృప్తిగా లేనందువల్లే ముఖ్యమంత్రి ఆయన్ను పక్కన పెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసంబ్లీలోనూ ఆయన అంత చురుగ్గా పాల్గొనలేదని.. విపక్షం విమర్శలకు సమాధానాలు ఇవ్వలేదని సీఎం వర్గ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గంలో యనమల, అచ్చెన్నాయుడు, రావెల వంటి ఇద్దరు, ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన వారు ఎవరూ తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని వారు వివరిస్తున్నారు. మొత్తం మీద ఈ రాజధాని బిల్లు వ్యవహారం ఎటుదారి తీస్తుందో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో చాపకిందనీరులా విస్తరిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: