జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు దశాబ్దాల తిరుగుబాట్ల చరిత్ర కలిగిన అస్సాం, మొత్తంగా చూస్తే ఏ యితర ఇటీవలి సంవత్సరాలతో పోల్చినా 2014 సంవత్సరమే తక్కువ మిలిటెంట్ హింసా ఘటనలను చవి చూసింది. మిలిటెంట్ గ్రూపుల్లో రెండు ప్రధాన సంస్ధలు అరబింద రాజ్ ఖోవా నేతృత్వంలోని ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’, రంజన్ దైమరి నేతృత్వంలోని ఎన్.డి.ఎఫ్.బి లు చర్చల బల్ల వద్దకు వచ్చాయి, ఈ చర్చలలో పరిమితమైన పురోగతి మాత్రమే ఉన్నప్పటికీ. ఈ లోగా చర్చలను వ్యతిరేకించిన ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) బలవంతపు వసూళ్లను, (ఉద్యోగులను) ఎత్తుకెళ్ళిపోవడాన్ని తీవ్రం చేసింది. భద్రతా బలగాలు ఈ సంస్ధపై స్ధిరంగా దాడులు నిర్వహించడంతో, ఇటీవల నెలల్లో ముఖ్యంగా ఇండియా-భూటాన్ సరిహద్దు వెంబడి ఉన్న బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా లోని జిల్లాల్లో దాని కేడర్ లో పలువురు చనిపోవడమో పట్టుబడడమో జరిగింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ గ్రూపు నుండి దాడులు జరగవచ్చన్న గూఢచార సమాచారాన్ని వెల్లడి చేసిన వెంటనే తాజా దాడి జరగడం గుర్తించదగిన విషయం. ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) కు వ్యతిరేకంగా దాడులు తీవ్రం చేసినందున ఆ సంస్ధనుండి ప్రతీకార దాడులు జరగవచ్చన్న హెచ్చరికలను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేయడం మరో గమనార్హ విషయం. తాజా హత్యాకాండ విస్తృతమైన జాతుల కలహానికి, తద్వారా భారీ దాడుల కార్చిచ్చుకు దారి తీయకుండా నిరోధించడం ప్రస్తుతం అధికారుల ముందున్న తక్షణ సవాలు. “సావ్రభౌమ బోడో లాండ్” అనే కారణం వెనుక తమ నేరపూరిత ఉద్దేశ్యాలను దాచి పెడుతున్న ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) తదితర సంస్ధల ముసుగును తొలగించాలంటే ఉన్న మెరుగైన మార్గం ప్రభుత్వం చారిత్రక అన్యాయాల నుండీ, వైపరీత్యాల నుండి ఉద్భవించిన బోడో ప్రజల న్యాయమైన ఆకాంక్షలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే. అభివృద్ధి, వివిధ హక్కుల కల్పన రూపేణా చారిత్రకంగా సంక్రమించిన అన్యాయాలను పరిష్కరించి బోడో ప్రజలు ప్రగతి సాధించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. బోడో, బోడోయేతర ప్రజల మధ్య చీలికలను సృష్టించే ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. వివిధ (జాతుల) ఛాయలు కలిగిన ప్రజా సమూహాలను పరస్పరం ఐక్యత చెందేలా సకల జాగ్రత్తలు తీసుకోవాలి. చర్చలు జరపడం వల్ల ఎల్లప్పుడూ తగిన ఫలితం ఉంటుందన్న సంగతిని చాటి చెప్పేందుకైనా ప్రస్తుతం రెండు సంస్ధలతో జరుపుతున్న చర్చలను తీవ్రంగా తీసుకుని పూర్తి చేయాలి. ఎన్.డి.ఎఫ్.బి(ఎస్) కేడర్లు 300 మంది కంటే ఎక్కువ ఉండరని అంచనా. వీరు మారుమూల అటవీ ప్రాంతాల్లో, ఎవరూ చేరుకోలేని చోట్లలో దాడి చేసి తప్పుకునే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వీరు పాల్పడుతున్న అవాంఛనీయ టెర్రర్ ఎత్తుగడల భూతాన్ని రాజ్యం సమూలంగా పెరికివేయాల్సిన అవసరం ఉంది. చర్చల వైఖరిని కొనసాగిస్తూనే దానితో పాటుగా భద్రతా బలగాల సాయంతో, గూఢచార బలగాలను సమర్ధవంతంగా వినియోగించడం ద్వారా భౌతిక ఊడ్చివేత చర్యలను చేపట్టాలి. ఈ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపే ఆటలో నిమగ్నం అయ్యే బదులు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయంగా తన భద్రతా బలగాలను రంగంలోకి దించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: