తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పార్టీ కంటే ప్రభుత్వ పాలన విధానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంవల్ల అంతర్గత కలహాలు ఇప్పుడిప్పుడే పొడసూపుతున్నాయి. విజయవాడలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనను పొగుడుతూనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, విజయవాడ పోలీసు కమిషనర్ ఎబి వెంకటేశ్వరరావును బాహాటంగా విమర్శించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై పూర్తి స్ధాయిలో వివరణ ఇవ్వాలని, ఇకపై పార్టీ ఎంపీలు, మంత్రులు బహిరంగంగా తమ అసంతృప్తిని మీడియాతో పంచుకోరాదని, బయట కార్యక్రమాల్లో మాట్లాడరాదని ఆదేశించారు. నైట్ డామినేషన్ పేరుతో విజయవాడలో రాత్రిళ్లు పోలీసులు గస్తీని తీవ్రం చేయడంతోపాటు, ప్రతి వ్యవహారంలో మంత్రి దేవినేని ఉమ జోక్యం పెరగడం విజయవాడ ఎంపి కేశినేని అసంతృప్తికి కారణం. అధికారుల మధ్య సమన్వయం లేదని, ప్రజాప్రతినిధులతో సంబంధం లేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా నాని మీడియా ఎదుట సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.  తెదేపా మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా రాజధాని కోసం భూసమీకరణ విధానాన్ని బాహాటంగా వ్యతిరేకించి ఉద్యమిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడచిన నేపథ్యంలో పార్టీలో అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కెఇ కృష్ణమూర్తి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. కెఇ బాధలో అర్ధం ఉందని కర్నూలుకు నిట్ లేదా ఐఐఐటి రెండింటిలో ఏదీ కేటాయించకుండా అన్నీ ఆంధ్రాలోనే ఏర్పాటు చేయడం కెఇకి ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైకోర్టు బెంచినైనా కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కెఇ కృష్ణమూర్తి ప్రయత్నించకపోతే రాజకీయంగా బలంగా ఉన్న కెఇ కుటుంబానికి కష్ట కాలం తప్పదంటున్నారు. రాయలసీమలో కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు కెఇ పలుకుబడి ఉపయోగించి జాతీయ విద్యా సంస్ధతోపాటు హైకోర్టు బెంచిని తెస్తారనే నమ్మకంతో ఉన్నారు. నర్సారావుపేట రాయపాటి సాంబశివరావు కూడా కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బిజెపిలో చేరారు. దీనివల్ల భవిష్యత్తులో టిడిపి-బిజెపి పొత్తు కొనసాగితే, బిజెపి నుంచి తనకు సవాలు విసిరే అవకాశం ఉందని రాయపాటి సాంబశివరావు అనుమానిస్తున్నారు. ఇప్పటికి ప్రశాంతంగానే ఉన్నా, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌నుంచి బిజెపికి పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కడితే, దీని ప్రభావం ప్రత్యక్షంగా తెదేపాపై ఉంటుంది. కెసిఆర్ బాటలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేసి ఆశావహులకు పదవులకు ఇస్తారనే నమ్మకం తెదేపా నేతలకు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: