విజయవాడలో అధికార పక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) చేసిన వ్యాఖ్యలతో ప్రకంపనాలు చోటుచేసుకుని కొన్ని గంటలు కూడా గడవకముందే విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహనరావుపై మాజీ శాసనసభ్యుడు యలమంచిలి రవి శనివారం చేసిన అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పటమట రైతుబజారులో రవి ఫొటోతో వున్న ఫ్లెక్సీని గద్దె అనుచరులు తొలగించి గద్దె ఫొటోతో సరికొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం రవికి ఆగ్రహం తెప్పించింది. రైతుబజారులో స్టాళ్లను గద్దెతోపాటు ఆయన అనుచరులు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు ముడుపులు అందుకుంటూ కేటాయిస్తున్నారని రవి ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో తాను గద్దె విజయానికి కృషి చేసినప్పటికీ టిడిపిలోకి తన రాకను కొందరు నేతలు జీర్ణించుకోలేక కక్షగట్టి వేధిస్తున్నారని అన్నారు. దీనిపై గద్దె మాత్రం నోరుమెదపనప్పటికీ పలువురు కార్పొరేటర్లు రవిపై ధ్వజమెత్తారు. కేవలం ఉనికి కోసం, తన రాజకీయ భవిష్యత్ కోసం రవి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఖండించారు. గద్దె మచ్చలేని మనిషనే విషయం అందరికీ తెలుసని స్పష్టం చేశారు. ఇదిలావుంటే, నగర పార్టీ నేతల మధ్య రాజుకున్న రాజకీయంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఎంపి కేశినేని నానిని హైదరాబాద్‌కు రప్పించుకుని జిల్లా ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి సుజనా చౌదని సమక్షంలో చర్చించినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: