యూపీఏ పదేళ్ల పాలన తలచుకుంటే.. అది ప్రవేశ పెట్టిన పథకాల కంటే.. జరిగిన కుంభకోణాలే ఎక్కవగా గుర్తొస్తాయి. వాటిలో బొగ్గు కుంభకోణం ఒకటి. సాక్షాత్తూ ప్రధాని మంత్రి కార్యాలయంపైనే ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు కలగజేసుకుని ఎన్నోసార్లు చెర్నాకోలతో అదిలించినా.. దర్యాప్తు మాత్రం ముందుకు పడలేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి విచారించే సాహసం సీబీఐ చేయలేకపోయింది. పేరుకు చట్టం ముందు అంతా సమానులే.. అయినా ప్రధాని వంటి వారు చాలా ఎక్కువ సమానులన్నట్టుగా సాగింది దర్యాప్తు.  ఇక ఇప్పుడు ప్రభుత్వం మారగానే.. దర్యాప్తు సంస్థల తీరుకూడా ఆటోమేటిగ్గా మారిపోతోంది. కోర్టులతో చీవాట్లు తిన్న రంజిత్ సింగ్ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వెళ్లిపోయాక ఇప్పుడు విచారణ కాస్త ఊపందుకుంటోంది. ఈ కుంభకోణంలో ఆనాటి ప్రధాని ప్రమేయంపై ఆరా తీసేందుకు సీబీఐ ధైర్యం చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించింది. అధికారికంగా ఎవరూ ఈ విషయాన్ని ధృవీకరించకపోయినా రెండు రోజుల క్రితం బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కోకు గనుల కేటాయింపుల వ్యవహారంలో మన్మోహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించినట్టు తెలుస్తోంది.  ఈ కుంభకోణంపై ఈ నెల 27న ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదిక సమర్పించాల్సి ఉంది. అందుకే విచారణ ఊపందుకొంది. మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన దర్యాప్తు బృందం... హిందాల్కో కేసు విషయంలో ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2005లో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయించాలని హిందాల్కో అధినేత కుమార్‌ మంగళం బిర్లా... అప్పటి ప్రధానికి రెండు ఉత్తరాలు రాశారు. ఈ కేటాయింపులకు సంబంధించిన అనేక వివరాలపై మన్మోహన్ సింగును సీబీఐ ప్రశ్నించిందట. యూపీఏ పాలనలో అసలైన అధికారం అనుభవించిన సోనియా, రాహుల్ అకృత్యాలకు పాపం సింగు గారు బలవుతారా.. లేక ధైర్యం చేసి నోరువిప్పి.. తెరవెనుక పాత్రధారుల గుట్టు కూడా విప్పుతారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: