ఆంధ్రా సీఎం చంద్రబాబు వ్యూహాలను కొన్నిసార్లు మెచ్చుకుని తీరవలసిందే.. కలలు కనండి.. వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడండన్న కలామ్ మాటలను ఆయన నిజం చేస్తున్నారు. దావోస్ పర్యటనలో ఆయన వాల్ మార్ట్ సీఈవో, పెప్సికో ఇంద్రానూయీలతో బేటీ అయ్యి.. ఏపీ ఉత్పత్తులను వారు బ్రాండింగ్ చేసేలా ఒప్పించడమంటే.. మాటలు కాదు.. ఏపీ సీఎంవో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులను వాల్ మార్ట్ బ్రాండింగ్ చేయబోతోంది. కోనసీమ కొబ్బరినీళ్లను పెప్సికో ప్యాక్ చేసి ప్రపంచమార్కెట్లో అమ్మబోతోంది. అంతేనా.. వేరుశెనగ, జీడిమామిడి, కొబ్బరి, జొన్న, చిరుధాన్యాలు, పండ్లు, అరటి, మామిడి, నిమ్మ, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు వంటి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడం ద్వారా రైతులకు సహకరించేందుకు వాల్ మార్ట్ అంగీకరించింది. ఇక పెప్సికో సీఈవో ఇంద్రానూయీ.. ఏపీ నుంచి జొన్న, బొప్పాయి, అరటి వంటి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పండే మొత్తం మామిడి పంటను కొంటానని చెప్పారు. పలుచోట్ల మామిడి గుజ్జు పరిశ్రమల ఏర్పాటు చేస్తామన్నారు. వాల్ మార్ట్ సీఈవో, పెప్పికో సీఈవో ఇద్దరూ త్వరలోనే ఏపీలో పర్యటిస్తామన్నారు.  మరి.. నిజంగా.. వాల్ మార్ట్, పెప్సికోల విషయంలో ఏపీ సీఎంఓ ఇచ్చిన సమాచారం ప్రకారం.. వారు ఏపీ సీఎంకు ఇచ్చిన హామీలు.. నెరవేరితే.. ఏపీ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ కు చేరుకోవడం ఖాయం. డ్వాక్రా మహిళల శక్తిని సరిగ్గా వినియోగించుకుని.. వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ఇస్తే.. వారు లక్షాధికారులు కావడం ఖాయం. అలాగే ఏపీలోని రైతు ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మగలిగితే.. అన్నదాత జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. మరి ఈ హామీలు ఎంత త్వరగా అమల్లోకి వస్తాయన్నది మాత్రం వెయిట్.. అండ్.. సీ.. అని చెప్పకతప్పదు..

మరింత సమాచారం తెలుసుకోండి: